కాలువలు, చెరువు గట్లపై మొక్కలు నాటాలి

నిజామాబాద్‌, జూన్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈసారి హరితహారం కార్యక్రమంలో భాగంగా కాలువలు, చెరువు గట్లపై 80 శాతం మొక్కలు నాటాలని నిర్దేశించుకోవడం జరిగిందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ వివిధ అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 250 కిలోమీటర్ల పొడుగునా మల్టీ లేయర్‌ లో మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యం విధించిందని అన్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లాలో ప్రధాన జలాశయాలైన నిజామ్‌ సాగర్‌, శ్రీరామసాగర్‌, అలీసాగర్‌, రామడుగు ప్రాజెక్టులకు చెందిన మెయిన్‌ కెనాళ్లతో పాటు, డిస్ట్రిబ్యూటరీ కాలువలకు చెందిన స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాల్సి ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రామ పంచాయతీల వారీగా ఆయా కాలువల పరిధిలో ఎంత విస్తీర్ణంలో స్థలం ఉందన్నది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, తదనుగుణంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు.

ముందుగా కాలువ స్థలాల్లో హద్దులు నిర్ణయిస్తూ ట్రెంచ్‌ కట్టింగ్‌ చేయించి గట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీల సహకారంతో వారం రోజుల్లోగా ఈ పనులు పూర్తి చేయాలని గడువు విధించారు. హద్దులు ఏర్పాటు చేసిన తరువాత వాటిని దాటుకుని కాలువ స్థలంలో ఇకపై పంటల సాగు చేపట్టకుండా చూడాల్సిన బాధ్యత గ్రామ సర్పంచ్‌, కార్యదర్శిదేనని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

ఉపయోగంలో లేని కాలువల స్థలాలను సైతం మొక్కలు నాటేందుకు గుర్తించాలన్నారు. ఎక్కువ విస్తీర్ణంలో స్థలం అందుబాటులో ఉంటే పల్లె ప్రకృతి వనాలు, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, ధాన్యం సేకరణ కేంద్రం వంటి వాటి కోసం గ్రామ పంచాయతీలు ఆ స్థలాలను వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు.

కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల మరమ్మతు పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకనూ పలుచోట్ల పనులు ప్రారంభించకపోవడం పట్ల కలెక్టర్‌ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునే వసతి గృహాలలో మౌలిక వసతుల కల్పనపై అంత నిర్లక్ష్యం ఎందుకని నిలదీశారు. నెలాఖరు వరకు పనులు పూర్తి చేయకపోతే సరెండర్‌ చేస్తామని హెచ్చరించారు.

మన ఊరు – మన బడి పనులను కూడా వేగవంతంగా చేపట్టాలని, ఇంకా పరిపాలనాపరమైన అనుమతులు పొందని పాఠశాలలకు సంబంధించి వచ్చే సోమవారం నాటికి సమగ్ర వివరాలతో ఎస్టిమేషన్లు పంపించాలని సూచించారు. జిల్లా మీదుగా వెళ్తున్న 44, 63 జాతీయ రహదారులకు ఇరువైపులా ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఒక్కో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసు పరిధిలో పది హెక్టార్ల పరిధిలో మొక్కలు నాటడంతో పాటు పిచ్చి మొక్కల తొలగింపు, ఫామ్‌ పాండ్స్‌ నిర్మాణం వంటి పనులు కూడా చేపట్టాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, డీఆర్డీఓ చందర్‌, జిల్లా పరిషత్‌ సీఈఓ గోవింద్‌, ఇరిగేషన్‌ ఎస్‌ ఈ బద్రి నారాయణ, డీపీవో జయసుధ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »