గాంధారి, జూన్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులను రాజులుగా చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం బాటలు వేస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. శుక్రవారం గాంధారి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే సురేందర్, ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మొదటగా స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం స్థానిక హారాలే గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సాయినేని సత్యనారాయణ రావు, వైస్ చైర్మన్‌గా రెడ్డి రాజులు సభ్యులుగా తూం అంజయ్య, పద్మ శంకర్, సుంకరి సత్యం, బొల్లి లక్ష్మి, దోళ్ళు సాయిలు, అమర్ సింగ్, శ్రీరాం రవీందర్ పిట్ల తిరుపతి, కోర్రి సంగమేశ్వర్, మోతిరాం, కొక్కొండ మహేశ్వర్, సంపత్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు.
అనంతరం నూతన చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడారు. రైతుల అభివృద్దే ధ్యేయంగా కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. రైతును రాజుగా చూడాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ దిశగా బాటలు వేస్తున్నారని అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ అని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని అన్నారు. రైతు పెట్టుబడికి ఎకరాకు 10 వేల రూపాయలు రైతు బంధు ఇస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్కడే అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా తెలంగాణ లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.ఆపద కాలంలో రైతు భీమా రైతులను ఆదుకుంటుందని అన్నారు. నూతన పాలకవర్గం మంచిగా పని చేసి పేరు తెచ్చుకోవాలని అన్నారు.
ఇప్పుడు ఏర్పడిన నూతన పాలకవర్గ సభ్యులు అందరిని కలుపుకొని పోయే వారిని నియమించడం జరిగిందని అన్నారు. రైతులకు ఇబ్బంది కల్గకుండా మార్కెట్ కమిటీ ని అభివృద్ధి పథంలో తీసుకోని వెళ్తూ, అందరి మన్ననలు పొందాలని సూచించారు. నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు వేదికల ద్వారా అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం తెరాస ప్రభుత్వం అని అన్నారు.దేశంలో ఎక్కడా అమలు కానీ పథకాలు తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. రైతులతో పాటు పేదల పక్షంలో అభివృద్ధి గురించి ఆలోచించేది కెసిఆర్ ఒక్కరే అన్నారు.
స్థానిక మార్కెట్ కమిటీలో పనిచేస్తున్న హమాలీల కొరకు ప్రత్యేక భవనం కావాలని స్థానిక తెరాస నాయకుడు, మాజీ జడ్పీటీసీ తానాజీ రావు కోరగా భావనానికి అవసరమైన నిధులను ఎంపీ కోటాలో ఇస్తానని ఎంపీ బీబీ పాటిల్ హామీ ఇచ్చారు. నూతన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం పటేల్ మాట్లాడుతూ బాధ్యతాయుతంగా పని చేసి గాంధారి మార్కెట్ కమిటీని రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేస్తానని అన్నారు.
పాలకవర్గం మొత్తం రైతుల కష్టాలు తెలుసుకొని, సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నిజామాబాదు జడ్పీ చైర్మన్ విట్టల్ రావు, ఎంపీపీ రాధా బలరాం నాయక్, జడ్పీటీసీ శంకర్ నాయక్, తెరాస నాయకులు తానాజీ రావు, ముకుంద్ రావు, శివాజీ రావు,సత్యం, మనోహర్ రావు వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.