కామారెడ్డి, జూన్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాలు లేని సురక్షిత కామారెడ్డి జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో రోడ్డు భద్రత మన అందరి బాధ్యత అనే అంశంపై అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు. వచ్చే ఏడాది ప్రమాదాలు లేని జిల్లాగా మార్చడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాల చోదకులు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. ద్విచక్ర వాహనచోదకులు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని చెప్పారు.
ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని చెప్పారు. నిబంధనలు పాటించి మీ విలువైన జీవితాలను కాపాడుకోవాలని కోరారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. గత ఏడాదిలో 263 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, వాటిలో 282 మంది మృతి చెందారని తెలిపారు. 253 చిన్న రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పారు. ఈ ప్రమాదాల్లో 525 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. 2022 లో జూన్ 25 నాటికి 139 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, 161 మంది మృతి చెందారని తెలిపారు.
145 చిన్న ప్రమాదాలు జరిగాయని,277 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాల్ పోస్టర్ లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, డీఎస్పీ సోమనాథం, పట్టణ సీఐ నరేష్, పోలీసులు, వాహనాల చోదకులు పాల్గొన్నారు.