ఎడపల్లి, జూన్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలు మత్తుపదార్ధాలకు, మద్యానికి దూరంగా ఉండాలని, యువత మత్తుపదార్థాలకు బానిసై కుటుంబాలకు దూరం కావొద్దని బోధన్ ఇంచార్జి ఏసీపీ కిరణ్ పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎడపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజలకు మత్తుపదార్థాల వినియోగం వల్ల జరిగే అనర్థాలు వివరిస్తూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బోధన్ ఇన్చార్జి ఏసిపి కిరణ్ మాట్లాడుతూ.. రోజురోజుకూ యువత గంజాయి, మత్తుమందులు, ధూమపానం, ఖైనీ, గుట్కాలతో పాటు నాటుసారా, మద్యం వంటి వ్యసనాలకు బలవుతున్నారన్నారు. తద్వారా వారి కుటుంబాలు వీధినపడుతున్నాయన్నారు. వ్యసనాలకు దూరంగా ఉన్నట్లయితే కుటుంబాలు బాగుపడతాయన్నారు. గ్రామాల్లో ఎక్కడైనా గంజాయి, మత్తుపదార్థాలు, డ్రగ్స్ వంటివి వినియోగం గాని అమ్మకాలు చేపడితే యువత, మహిళలు వ్యతిరేకించి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
మత్తుపదార్థాలకు బానిసైన యువకులకు వైద్యులచే కౌన్సెలింగ్ నిర్వహించి డ్రగ్స్ నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. అనంతరం రూరల్ సిఐ శ్రీనివాస్ రాజ్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. అంతే కాకుండా దొంగతనాల నివారణకు గ్రామంలో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సర్పంచ్ ను కోరారు.
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గ్రామస్తులతో మత్తుపదార్థాలు- వద్దు ఆరోగ్యం ముద్దు అంటూ నినాదాలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రూరల్ సిఐ శ్రీనివాస్ రాజ్, ఎస్ఐ పాండేరావు, స్థానిక సర్పంచ్, ఉపసర్పంచ్ విజయ్ కుమార్, విడిసి చైర్మన్ లక్ష్మణ్ బాబు,గ్రామ పెద్దలు, యువకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.