మోర్తాడ్, జూన్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని వడ్యాట్, దోన్‌పాల్, సుంకెట్, పాలెం, తిమ్మాపూర్, షెట్‌పల్లి, ధర్మోరా, దొన్‌కల్ గాండ్లపేట్ మోర్తాడ్ మండల కేంద్రంతోపాటు కమ్మర్‌పల్లి, ఏర్గట్ల, భీమ్‌గల్, వేల్పూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో గల రైతులు నార్లు పోసి, దుక్కి దున్ని, దమ్ము చేసి వరినాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు.
వర్షాలు సరిగా కురియక పోవడంవల్ల భూగర్భ జలాలు బోర్లలో పైకి రానందున నీటి కొరకు చూస్తున్నామని, బోర్లలోకి నీరు రాగానే వరి నాట్లు వేయడం ప్రారంభిస్తామని రైతులు తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విడుదల చేయాల్సిన రైతుబంధు నిధులు ఇంతవరకు విడుదల చేయనందున రైతులు ప్రభుత్వాన్ని ఇదేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతుబంధు నిధులు విడుదల చేసి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.