ఎడపల్లి, జూన్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ ప్రజలు గ్రామదేవతలకు అత్యంత నియమనిష్ఠలతో బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామస్థులు డప్పు వాయిద్యాలతో గ్రామ దేవతల గుడిల వద్దకు వెళ్లి బోనాలు సమర్పించారు. గ్రామ పొలిమేరలో గల గ్రామ దేవతలకు బోనం సమర్పించిన గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని సుభిక్షంగా ఉంచాలని వేడుకున్నారు.
అలాగే పెద్ద పోచమ్మ ఆలయ 3వ వార్షికోత్సవాన్ని గ్రామస్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి గ్రామ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామంలో గ్రామస్థులు ఆయురారోగ్యాలతో ఉండాలని పాడి, పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ ప్రతీ ఏటా తమ గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించుకోవడం జరుగుతుందని అన్నారు.
కరోనా మహమ్మారి ఉధృతి పూర్తిగా తొలగిపోవాలని గ్రామ దేవతలను కోరుకొన్నామని అన్నారు. కార్యక్రమంలో ఆంజనేయులు, గోవింద్, నారాయణ రెడ్డి, కృష్ణ, రాజయ్య, దత్తు, కొమురయ్య,రాకేష్ గౌడ్, రాములు, నారాయణ, స్వామిగౌడ్, గ్రామపెద్దలు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.