ఎడపల్లి, జూన్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు నాట్లు వేసే ముందు రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి భాస్వరంతో కూడిన పిఎస్బి సేంద్రియ ఎరువులను వాడినట్లయితే పంట దిగుబడి అధికంగా ఉంటుందని బోధన్ ఏడిఏ సంతోష్ అన్నారు. ఎడపల్లి మండలం అంబం (వై) గ్రామంలో మంగళవారం మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు వానకాలం పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏడిఏ సంతోష్ మాట్లాడుతూ… రసాయనిక ఎరువులు వాడటం వలన పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి అని అధికారులు రైతులకు సలహాలు సూచనలు అందజేశారు. ఒక ఎకరానికి సరిపడా భాస్వరంతో కూడిన లిక్విడ్ స్ప్రేమందును పేడలో కలిపిన తర్వాత ఒకరోజు అనంతరం ఎకరం పంట పొలాల్లో స్ప్రే చేసుకుంటే రసాయనిక ఎరువులు అవసరం లేదన్నారు. భాస్వరంతో కూడిన ఎరువులను తప్పకుండా వాడాలని ఈ సందర్భంగా రైతులను కోరారు.
గతంలో రైతుల నుండి మంచి స్పందన వచ్చిందని, గ్రామానికి చెందిన ఓ రైతు తాను పేడ, భాస్వరంతో కూడిన సేంద్రీయ మందులను వాడడం వలన అధిక దిగుబడులు వచ్చాయని అధికారుల దృష్టి తేవడంతో అధికారులు ఆయనను అభినందించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రైతులు పొందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, అవసరమైతే రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు కావాల్సిన సలహాలు సూచనలను అందజేస్తామన్నారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించాలని రైతులను అధికారులు కోరారు. కార్యక్రమంలో ఎడపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి సిద్ది రామేశ్వర్, ఏఈఓ జ్యోతి, స్థానిక మాజీ ఉపసర్పంచ్ సున్నపు ఒడ్డేన్న, రైతులు లక్ష్మణ్, ధర్మారెడ్డి, గంగాధర్ మహిళా రైతులు అబ్బవ్వ, తదితరులు ఉన్నారు.