నిజామాబాద్, జూన్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్యారోగ్య శాఖలో జిల్లా స్థాయి అధికారి మొదలుకుని కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఉద్యోగికి అటెండెన్స్ యాప్ ఆధారంగానే జీతాల చెల్లింపులు జరగాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలకు భిన్నంగా ఎవరికైనా జీతాలు మంజూరు చేస్తే, సంబంధిత డీ.డీ.ఓల నుండి ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రగతిని సమీక్షించారు.
అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు నిర్వహణ నూటికి నూరు శాతం పక్కాగా ఉండాలని, తమ పరిశీలనలో ఎక్కడైనా పొరపాటుకు ఆస్కారం కల్పించినట్టు వెల్లడైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే, ఈ-ఔషధీ యాప్ లోనే అవుట్ పేషంట్ల వివరాలను నమోదు చేయాలని, వారికి అందించిన చికిత్సలు, మందుల వివరాలను సైతం యాప్‌లో పొందుపర్చాలని కలెక్టర్ సూచించారు. ప్రతి గర్భిణీకి సంబంధించిన వివరాలు మూడవ మాసంలోనే తప్పనిసరిగా నమోదు కావాలని, ఈ విషయంలో క్షేత్ర స్థాయిలో ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు గట్టిగా కృషి చేయాలని అన్నారు.
గర్భిణీలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని, అదే సమయంలో వారి రక్త నమూనాలను సేకరించి డీ-హబ్ కు పరీక్షల నిమిత్తం పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రసవ సమయం నాటికి ఏ ఒక్క గర్భిణీ మహిళా కూడా రక్త హీనతతో ఇబ్బంది పడకుండా వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, అవసరమైన వారికి మందులు అందిస్తూ వాటిని వాడుతున్నారా లేదా అన్నది పరిశీలించాలని సూచించారు. జిల్లాలో సగటున 52 శాతం వరకే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు జరుగుతున్నాయని, నూటికి నూరు శాతం జరిగేలా ప్రతి ఒక్కరు అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు.
ఎక్కడైనా వంద శాతం ప్రసవాలన్నీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగితే, సంబంధిత ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలో పని చేస్తున్న వారందరికీ జీతాలు నిలిపివేయాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనిపై తాము విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, ఆ తరువాతే తమ అనుమతితో మిగతా వారికి జీతాలు మంజూరు చేయాలని అన్నారు. ప్రజలకు సేవలు అందించేందుకే ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుందని, అలాంటప్పుడు పని చేయకుండా విధుల పట్ల అలసత్వం ప్రదర్శించే వారికి తప్పనిసరిగా జీతాలు నిలుపుదల చేస్తామని కలెక్టర్ కరాఖండీగా తేల్చి చెప్పారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగానే కొనసాగుతోందని సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, మిగిలిపోతున్న ఒకటి,రెండు శాతం లక్ష్యాన్ని కూడా సాధించేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ చికిత్సలకు చొరవ చూపాలని, దీనివల్ల వైద్యులకు ఇన్సెంటివ్ రావడంతో పాటు ఆసుపత్రికి కూడా నిధులు సమకూరుతాయని, వాటిని అభివృద్ధి పనుల కోసం వెచ్చించవచ్చని సూచించారు.
ఆరోగ్యశ్రీ బిల్లులు మంజూరు చేయించే బాధ్యత తమదేనని భరోసా కల్పించారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద రోజుకు రెండు చొప్పున వారంలో కనీసం పన్నెండు మందికైనా ఆపరేషన్లు, ఇతరత్రా చికిత్సలు అందించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ సుదర్శనం, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్, డీడబ్ల్యుఓ రaాన్సీ, పీ.ఓ డాక్టర్ అంజనా తదితరులు పాల్గొన్నారు.