ఎడపల్లి, జూన్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 3 నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగిన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పనులు ఆశాజనకంగా జరిగాయని జెడ్పీ సీఈవో గోవింద్ అన్నారు. మంగళవారం ఎడపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. జడ్పీ సీఈఓ విచ్చేసిన సమయంలో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం అక్కడి నుండి ఎంపీడీవో ఆఫీసుకు చేరుకొని పల్లె ప్రగతి ఐదో విడత కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై ఎంపిడిఓ సాజిద్ అలీని అడిగి తెలుసుకున్నారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు మిగతా గ్రామాలలో కూడా పల్లె ప్రగతి కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులు, మండల ప్రత్యేక అధికారి, గ్రామస్థాయి ప్రత్యేక అధికారులు, ఆయా శాఖల సిబ్బంది పాల్గొని సమిష్టి కృషి చేయడం వల్లనే పల్లె ప్రతి కార్యక్రమాలు విజయవంతం కావడం సంతోషంగా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అనంతరం ఎడపల్లి మండల కేంద్రంలోని స్మశాన వాటికను ఆయన సందర్శించారు. జిల్లా వ్యాప్తంగా ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాలలో గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. కొన్ని గ్రామాలలో కనీసం 90 శాతం అభివృద్ధిపనులు జరిగినట్లు ఆయన తెలిపారు. గ్రామాలలో ప్రజలకు తాగునీటి సౌకర్యం ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
వీధిలైట్లు ఏర్పాటు, మురికి కాలువల శుభ్రత పనుల పై ప్రత్యేక దృష్టి సారించే విధంగా సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో సాజిద్ అలీ పలు సూచనలు సలహాలు చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామంలో మున్ముందు వంద శాతం అభివృద్ధి పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామని జెడ్పి సీఈఓ గోవిందు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ రజిత యాదవ్, ఉపసర్పంచ్ ఆకుల శ్రీనివాస్, సెక్రెటరీ, రాజేశ్వర్, జిపి సిబ్బంది తదితరులు ఉన్నారు.