నిజామాబాద్, జూన్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా కొనసాగించాలని అదనపు కలెక్టర్ బీ.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బక్రీద్ వేడుకను పురస్కరించుకుని అదనపు కలెక్టర్ అధ్యక్షతన ఆయన ఛాంబర్‌లో బుధవారం పశువుల అక్రమ రవాణా నిరోధంపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు.
జిల్లాలోని అంతర్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన కందకుర్తి, సాటాపూర్, సాలూర, పొతంగల్, ఖండ్ గావ్‌లతో పాటు అంతర్ జిల్లా సరిహద్దులు యంచ, పోచంపాడ్, కమ్మరపల్లి, ఇందల్వాయి టోల్ గేట్‌ల వద్ద ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానికంగా కూడా వారిని, మోస్రా, మాణిక్ భండార్, మాధవనగర్, అర్సపల్లి, వర్నిరోడ్, మామిడిపల్లి ఎక్స్ రోడ్డుల వద్ద తనిఖీ కేంద్రాలను నెలకొల్పి రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలకు చెందిన అధికారులు నిరంతరం నిఘా ఉండేలా పర్యవేక్షణ చేయాలని అన్నారు.
నిబంధలు విరుద్ధంగా వివిధ వాహనాలలో పశువులను తరలిస్తే వెంటనే సీజ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజ్ చేసిన పశువులకు స్థానికంగానే షెల్టర్ కల్పిస్తూ, వాటికి పశుగ్రాసం, నీటి వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో గోశాల నిర్వాహకుల సహకారం తీసుకోవాలని అన్నారు. సాటాపూర్, పొతంగల్ తదితర చోట్ల కొనసాగే పశువుల వారాంతపు సంతను రెండు వారాల పాటు తాత్కాలికంగా నిలిపివేసేలా స్థానిక గ్రామపంచాయతీల ద్వారా సర్క్యులర్ జారీ చేయించాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు.
పశువుల అక్రమ రవాణా నిరోధం విషయమై పరస్పర సమన్వయం కోసం జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని పశు సంవర్ధక శాఖ అధికారులకు సూచించారు. కాగా, బక్రీద్ వేడుకను సహృద్భావ వాతావరణంలో జరుపుకునేందుకు వీలుగా అవసరమైన వసతులు కల్పించాలన్నారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ తదితర పట్టణాలలో ఎక్కడబడితే అక్కడ పశువులను వధించకుండా కట్టడి చేయాలని, నిర్ణీత ప్రాంతాల్లోనే పశువధ చేయాలని, వ్యర్ధాలను నివాస ప్రాంతాల నడుమ, రోడ్లపై పారవేయకుండా ప్లాస్టిక్ బ్యాగ్లను అందించాలని సూచించారు.
వ్యర్ధాలతో కూడిన ప్లాస్టిక్ బ్యాగ్ లను మున్సిపల్ శానిటేషన్ సిబ్బందిచే సేకరింపజేసి జనావాసాలకు దూరంగా పారవేయించాలని అన్నారు. దీనివల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా కాపాడినట్లు అవుతుందన్నారు. ప్రజల్లో ఈ విషయమై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డీసీపీ అరవింద్ బాబు, ఆర్దీవోలు రవి, శ్రీనివాసులు, రాజేశ్వర్, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ భరత్, సహాయ సంచాలకులు బలీగ్ అహ్మద్, నగరపాలక సంస్థ ఎం హెచ్‌ఓ సాజిద్ తదితరులు పాల్గొన్నారు.