డిచ్‌పల్లి, జూన్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దున్నేవానికే భూమి దక్కాలని నినదించిన వీరుడు తొలి అమరవీరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 76 వర్థంతి జూలై 4న అమరత్వం పొందిన సందర్భంగా ఆయన పోరాట స్ఫూర్తితో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భూమి పేదలకు దక్కాలని, పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, పోడు రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని తదితర డిమాండ్‌లతో జూలై 4న చలో ప్రగతి భవన్ పిలుపునివ్వడం జరిగిందని సాయినాథ్ అన్నారు. ఇందుకు సంబంధించిన గోడప్రతులను మండల కేంద్రంలో గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వాసరి సాయినాథ్ మాట్లాడుతూ కౌలు రైతులు కూడా రైతు బంధు, బ్యాంకు అప్పులు తదితర ప్రభుత్వ సహాయం చేయాలని ధరణిపోర్టల్ లో రైతులకు జరిగిన అన్యాయాలను సరిదిద్దాలని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, సొంత స్థలం ఉన్న పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అందించాలని, ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని, వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
2006లో అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయకపోగా, కేసీఆర్ ప్రభుత్వం 8 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. గుంటో, సెంటో సాగు చేసుకుంటున్న గిరిజన దళిత పేద కుటుంబాల హరితహారం పేరుమీద అట్టి భూముల నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్న టిఆర్‌ఎస్ సర్కారును ప్రజలు నమ్మడం లేదని అన్నారు. ఎన్నికల ముందు గిరిజనులకు కుర్చీ వేసుకొని వరి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇస్తానని దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేపడతాం అని చెప్పిన మాటలన్నీ గాలిలో కలిసి పోయాయని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
ఇప్పటికైనా దళిత గిరిజన పేద కుటుంబాల సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో జులై 4న జరిగే చలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని గిరిజనలు, దళితులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అరుణ్, శ్రీకాంత్, పురుషోత్తం, గంగాధర్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.