కామారెడ్డి, జూన్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎదురవుతున్న నెట్వర్క్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్తగా 4జి నెట్వర్క్‌తో కూడిన విజన్ టెక్ కంపెనీ ఈ – పాస్ మిషన్‌లు, హై రిస్ మిషన్ యంత్రాలను అమల్లోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. అధునాతన ఈ- పాస్ మిషన్‌లు, హై రిస్ మిషన్ యంత్రాలలో రేషన్ పంపిణీ సులభతరం అవుతోందని చెప్పారు.
గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హల్‌లో జిల్లాలోని 578 రేషన్ షాపులకు 4 జి నెట్వర్క్ తో కూడిన విజన్ టెక్ కంపెనీ ఈ – పాస్ మిషన్‌లు, ఐ రిస్ మిషన్ యంత్రాలను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. అనంతరం వాటి పనితీరు, ఉపయోగించే విధానంపై డీలర్లకు పౌర సరఫరాల అధికారులు శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ డీలర్లను ఉద్దేశించి మాట్లాడారు.
రేషన్ కార్డు దారులకు జులై నెల బియ్యం పంపిణీనీ ఆధునీకరించిన కొత్త మిషన్ల ద్వారా చేపట్టాలని సూచించారు. గతంలో ఓయాసిస్ కంపెనీకి చెందిన 2 జి నెట్వర్క్ ఆధారిత యంత్రాల ద్వారా బియ్యం పంపిణీ చేసే సమయంలో పంపిణీ కార్యక్రమం వేగంగా జరిగేది కాదన్నారు. నెట్వర్క్ సమస్యలు ఉత్పన్నమయ్యేవని తెలిపారు. ప్రస్తుతం పంపిణీ చేసిన యంత్రాలు 4జీ నెట్వర్క్‌తో పని చేస్తుండటంతోపాటు ఎక్కడ ఏ మొబైల్ సిగ్నల్ వస్తుందో దాని ద్వారానే ఎటువంటి ఆటంకాలు లేకుండా మారుమూల ప్రాంతాల్లోనూ రేషన్ పంపిణీ నిరాటంకంగా వేగంగా చేపట్టవచ్చని అన్నారు.
రేషన్ డీలర్లు ప్రజా పంపిణీ వ్యవస్థ ను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజశేఖర్, జిల్లా డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు, డీలర్లు పాల్గొన్నారు.