నందిపేట్, జూన్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలంలోని గ్రామాల్లోని వరినాట్లకు కూలీలు సరిపోక ఇతర ప్రాంతాల నుంచి కూలీలను పిలిపించుకోవాల్సి వస్తున్నటువంటి ప్రస్థుత పరిస్థితిలో కూలికి కాదు సేవకై వస్తామని కూలీ తీసుకోకుండానే వరి నాటడానికి ఉచితంగా పని చేయడానికి వచ్చి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే నందిపేట మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమం పలుగుగుట్ట సమీపంలో 10 ఎకరాల వ్యవసాయ భూమి వుంది, దానిలో పని చేయడానికి కూలీల అవసరం ఉండదు. భక్తులే ఉచిత కూలీలుగా మారి సేవ దృక్పదంతో పని చేయడానికి, నాట్లు వేయడానికి ప్రతి రోజు వంతుల వారీగా వచ్చి పని చేసి వెళ్తుంటారు. వ్యవసాయ భూముల్లోనే కాకుండా ప్రతి రోజు జరిగే నిత్యాన్నదాన కార్యక్రమంలో కూడ సేవ చేయడానికి, వంట పాత్రలు శుభ్రం చేయడానికి కూడ గ్రామాల నుండి వంతుల వారీగా వచ్చి పని చేసి వెళ్లి ఆశ్రమ వ్యస్థాపకులు మంగి రాములు మహారాజ్ ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు.
ప్రతి పని డబ్బుతో ముడిపడి ఉండే ఈ కాలంలో కూడా ప్రజలు సేవ కొరకు రావడం పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు. అంతేకాదు సేవచేయాలంటే ఒక నెలరోజుల ముందుగానే పేరు నమోదుచేసుకోవాల్సి ఉంటుందని ఓ భక్తుడు వివరించాడు. ఇలా సేవచేయడం వల్ల శ్రమదానం, మనశ్శాంతి కలుగుతుందని చెబుతున్నారు.