నిజామాబాద్, జూలై 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనాన్ని మరింతగా పెంపొందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్‌తో కలిసి జిల్లా సరిహద్దు ప్రాంతాలైన ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి నుండి మొదలుకుని బాల్కొండ మండలం పోచంపాడ్ వరకు 44వ నెంబర్ జాతీయ రహదారి పొడుగునా హరితహారం మొక్కలను పరిశీలించారు.
డిచ్‌పల్లి, ఇందల్వాయి, చంద్రాయన్‌పల్లి, జక్రాన్‌పల్లి, సోన్ పేట్, శ్రీరాంపూర్, పోచంపాడ్ తదితర ప్రాంతాల్లో కలెక్టర్ జాతీయ రహదారికి ఇరువైపులా పలు వరుసలలో నాటిన మొక్కలను పరిశీలించి సూచనలు చేశారు. రహదారి పొడుగునా ఏ ఒక్క మొక్క కుడా కింద పడకుండా చూసుకోవాలని, నాటిన ప్రతి మొక్క బ్రతికేలా సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఖాళీగా కనిపిస్తున్న స్థలాల్లో వరుస క్రమంలో విరివిగా ఎత్తైన మొక్కలు నాటాలని ఆదేశించారు. మొక్కల సంరక్షణ కోసం చేపడుతున్న పనులకు వెంటదివెంట బిల్లులు మంజూరు చేయిస్తామని అన్నారు. రహదారి మధ్యన మెరిడియన్ భాగంలో ఆకర్షణీయమైన మొక్కలు ఉండాలన్నారు. డిచ్పల్లి నుండి ఇందల్వాయి వరకు అనేక ప్రాంతాల్లో మెరిడియన్ ప్రాంతంలో మొక్కల నిర్వహణ సక్రమంగా లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పక్షం రోజుల్లో పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపించాలని, జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఆదేశించారు.
పచ్చదనాన్ని పెంపొందించే మొక్కలతో పాటు పూల మొక్కలు నాటాలన్నారు. జిల్లాలో జాతీయ రహదారులకు ఇరువైపులా హరితహారం మొక్కలు విస్తృతంగా నాటి, వాటి సంరక్షణకు గట్టి చర్యలు చేపడుతున్నారని ఇటీవలే స్వయాన సిఎం కె.చంద్రశేఖర్ రావు ప్రశంసించారని కలెక్టర్ గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని హరితహారం మొక్కల పెంపకం, సంరక్షణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అన్నారు.
నాటిన మొక్కలను పశువులు పాడు చేయకుండా కంచె తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం వర్షాలు అనుకూలిస్తున్నందున ఖాళీ ప్రదేశాల్లో యుద్ధప్రాతిపదికన మొక్కలు నాటించాలన్నారు. ఈ సందర్భంగా చంద్రాయన్ పల్లి, పోచంపాడ్ వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలను కలెక్టర్ పరిశీలించారు. వివిధ రకాల మొక్కలు ఏపుగా పెరిగి, పంపిణీకి సిద్ధంగా ఉండడాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట అటవీ శాఖ అధికారులు భవానీ శంకర్, రామకృష్ణ, హిమచందన, ఎంపీడీవోలు గోపి, లక్ష్మణ్, బాల్కొండ మండల ప్రత్యేక అధికారి యోహాన్ తదితరులు ఉన్నారు.