నిజామాబాద్, జూలై 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో స్వీపింగ్ సంబంధించిన పాత టెండర్లను రద్దుచేసి శానిటేషన్, పేషెంట్ కేర్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ధర్నాను ఉద్దేశించి ఓమయ్య మాట్లాడుతూ జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ప్రధానంగా ప్రస్తుతం ఉన్న పాత టెండర్ విధానాన్ని రద్దుచేసి 2022 జులై 1 నుండి కొత్త టెండర్ను ప్రారంభించి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, ఇప్పటికే పెండిరగ్లో ఉన్న 2 నెలల వేతనాలు చెల్లించాలని అన్నారు. ఆస్పత్రిలో శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సంఖ్యను పెంచాలని, మెడికల్ కళాశాలలో కార్మికులకు అనుగుణంగా బడ్జెట్ పెంచి మెడికల్ కళాశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం బకాయి పడిన పిఎఫ్ డబ్బులను జమ చేసి కార్మికులకు వ్యక్తిగత రసీదులు ఇవ్వాలని, సంవత్సరానికి 23 జాతీయ, పండుగ, ఆర్జిత సెలవులు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు పి. సుధాకర్ నాయకులు హైమది, భాగ్యలక్ష్మి, కవిత, లింగం కార్మికులు పాల్గొన్నారు.