కామారెడ్డి, జూలై 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలో అన్ని వృత్తుల కన్నా వైద్య వృత్తి పవిత్రమైనదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్యులకు సన్మానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
అంకిత భావంతో పనిచేసే వైద్యులు ప్రజల మన్ననలు పొందుతారని చెప్పారు. అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మని ఇస్తారని పేర్కొన్నారు. సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. కరోనా సమయంలో సేవలందించిన 80 మంది వైద్యులకు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సన్మానం చేశారు.
కార్యక్రమంలో జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు రాజన్న మాట్లాడారు. మండల సమావేశంలో వైద్యులకు తగిన గౌరవం ఇవ్వాలని కోరారు. అన్ని వృత్తుల కన్నా వైద్య వృత్తి మిన్నగా ఉంటుందని చెప్పారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి లక్ష్మణ్ సింగ్, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ నాగరాజు గౌడ్, కార్యదర్శి రఘుకుమార్, ప్రతినిధులు సంజీవరెడ్డి, వేణుగోపాల్, డాక్టర్ విక్రమ్, దస్థిరాం, వైద్యులు డాక్టర్ రవీందర్ రెడ్డి, చంద్రశేఖర్, శోభారాణి పాల్గొన్నారు.