నిజామాబాద్, జూలై 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చదువుకునే వయస్సు కలిగి ఉన్న బాలలను పనులలో కొనసాగించడం నేరమని, అలాంటి బాలలను గుర్తించేందుకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ అమలుపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా చోట్ల పనులలో కొనసాగుతున్న బడిఈడు బాలలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. గడిచిన రెండు సంవత్సరాల నుండి కరోనా కారణంగా ఆపరేషన్ ముస్కాన్ అమలు అంతంతమాత్రంగానే జరిగిందని, ప్రస్తుతం పూర్తి స్థాయిలో అమలు చేస్తూ మంచి ఫలితాలు సాధించేందుకు అధికారులు అంకితభావంతో కృషి చేయాలన్నారు. కరోనా తీవ్రత కారణంగా విద్యాసంస్థలు మూసిఉండడం వల్ల అనేకమంచి బాలలు పనుల్లో చేరారని అన్నారు.
ప్రస్తుతం అన్ని వ్యాపార సంస్థలను పరిశీలిస్తూ, ఎక్కడైనా బాల కార్మికులు పని చేస్తున్నట్లు గుర్తిస్తే వారిని తక్షణమే బడుల్లో చేర్పించాలని సూచించారు. ప్రధానంగా విద్య శాఖ ఈ విషయంలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఉపాధ్యాయులు తమతమ పరిధిలో ఎక్కడైనా చిన్నారులు బడికి రాకుండా పనులకు వెళ్తున్నట్లు గమనిస్తే తక్షణమే వారిని బడుల్లో చేర్పించేలా చొరవ చూపాలన్నారు.
కార్మిక శాఖ అధికారులు కూడా విరివిగా తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా పాఠశాలల పరిధిలో బాల కార్మికులెవరూ పనుల్లో కొనసాగకుండా పక్కాగా చర్యలు చేపట్టాలని, ఈ మేరకు ప్రదోనోపాద్యాలు ధ్రువీకరణ పత్రం అందజేయాలని ఆదేశించారు.
హరితహారం అమలును వేగవంతం చేయండి : కలెక్టర్
వర్షాలు అనుకూలిస్తున్నందున హరితహారం అమలును మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రగతి భవన్లో ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కో శాఖ వారీగా ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటాలని, అధికారులు ప్రతిరోజు ఈ కార్యక్రమం అమలుతీరును క్షేత్రస్థాయి నుండి సమీక్షించాలని సూచించారు. విద్యుత్ సబ్-స్టేషన్లు, రైతువేదికలు, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో మొక్కలు నాటడంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు.
నామ్ కె వాస్తే అన్నట్టుగా కాకుండా, అంకిత భావంతో హరితహారం విజయవంతానికి కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. కాలువలకు చెందిన స్థలాల్లో బండ్ ఏర్పాటు పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, తద్వారా ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. నర్సరీల్లో ఖాళీగా ఉన్న బ్యాగులలో వివిధ రకాల విత్తనాలు వేయిస్తే, వచ్చే సంవత్సరం హరితహారం కింద నాటేందుకు అవసరమైన మొక్కలు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ సూచించారు.
ఉపాధి హామీ, మన ఊరు – మన బడి పనులు నాణ్యతతో జరిగేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, తదితరులు పాల్గొన్నారు.