నిజామాబాద్, జూలై 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో సీజనల్ వ్యాధుల నివారణపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, విష జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

గత సంవత్సరం జిల్లాలో డెంగ్యూ వ్యాధి, వైరల్ ఫీవర్స్‌తో ప్రజలు ఒకింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న చర్యల ఫలితంగా జిల్లాలో మలేరియా కేసులు క్రమేణా తగ్గుముఖం పట్టాయని అన్నారు. 2019 వ సంవత్సరంలో 30 కేసులు నమోదు కాగా, 2020 లో ఒకటి, 2021 లో రెండు కేసులు మాత్రమే వచ్చాయని, ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు.
అయితే గతేడాది డెంగ్యూ కేసులు 396 నమోదయ్యాయని వివరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈసారి జిల్లా వ్యాప్తంగా ఎంతో అప్రమత్తతో కూడిన చర్యలు చేపట్టాలని హితవు పలికారు. ఎక్కడ కూడా నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని, మంచి నీరు కలుషితం కాకుండా పైప్ లైన్ లీకేజీలను అరికట్టాలని, నివాస ప్రాంతాల నడుమ పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం ఉండకూడదని సూచించారు. మురుగునీటి కాల్వలను క్రమం తప్పకుండా శుభ్రపర్చేలా చర్యలు తీసుకోవాలని, నీరు నిలువ ఉన్న ప్రాంతాల్లో దోమల వ్యాప్తిని నివారించేందుకు ఆయిల్ బాల్స్ వేయాలని అన్నారు.
ప్రధానంగా నివాస ప్రాంతాలలో ప్రతి ఇంటికి ఆశా కార్యకర్తలు వెళ్లి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేలా చూడాలని, ప్రజలు దోమతెరలు వాడేలా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. దీనికోసం వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. దోమకాటుకు గురై మలేరియా, డెంగ్యూ, విషజ్వరాలు వంటి వ్యాధులకు లోనైతే చికిత్స కోసం అనవసర వ్యయప్రయాసలకు లోనవడంతో పాటు, ఆరోగ్యం దెబ్బతింటుందని, దీనితో పోలిస్తే చిన్నమొత్తం ఖర్చును భరిస్తూ దోమతెరనూ కొనుగోలు చేసి వినియోగించడం ఎంతో ఉత్తమం అని కలెక్టర్ పేర్కొన్నారు.
కాగా, విష జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధుల బారిన పడిన వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనే అవసరమైన చికిత్సలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది అన్నివిధాలుగా సన్నద్ధమై ఉండాలని, అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణ కోసం సంబంధిత శాఖలు సమన్వయంతో, సమిష్టిగా కృషి చేయాలని అన్నారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్, డీపీవో జయసుధ, డీఆర్‌డీఓ చందర్, జెడ్పి సీఈఓ గోవింద్, డీఈఓ దుర్గాప్రసాద్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిణి రaాన్సీ, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.