ప్రతి ఒక్కరూ దోమ తెరలు వినియోగించాలి

నిజామాబాద్‌, జూలై 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకాటుకు గురై డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా దోమ తెరలు వినియోగించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. దీని ప్రాధాన్యతను గుర్తిస్తూ ఉద్యమం తరహాలో ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ వైద్యారోగ్య శాఖ పనితీరును సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ప్రతి నివాస ప్రాంతంలో ఇంటింటికీ తిరుగుతూ దోమ తెరలు వాడేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. వీటి వినియోగం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పిస్తే దోమ తెరల వాడకానికి ప్రజలు తప్పనిసరిగా ముందుకు వస్తారని అన్నారు. వారం పది రోజుల వ్యవధిలో ఏ ఒక్క నివాసం కూడా మినహాయించబడకుండా ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజలందరూ దోమ తెరలు వాడేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. దీనిని తేలికైన విషయంగా భావించకూడదని, ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ కోసం చేస్తున్న ఎంతో మంచి కార్యమని కలెక్టర్‌ హితవు పలికారు. వైద్యాధికారులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు.

జిల్లాలో గతేడాది డెంగ్యూ కేసులు ఒకింత ఎక్కువ మొత్తంలో నమోదయ్యాయని, ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. నివాస ప్రాంతాల్లో చెత్తాచెదారం లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, ఖాళీ స్థలాల్లో నీరు నిలువ ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా మంచినీరు కలుషితం కాకుండా, పైప్‌ లైన్‌ లీకేజీలు ఏర్పడితే వెంటనే సరిచేయాలన్నారు.

సిబ్బంది ఇంటిటికి వెళ్లే సందర్భంలో ఎక్కడైనా శానిటేషన్‌, నీటి కలుషితం వంటి వాటిని గమనిస్తే వెంటనే అధికారుల దృష్టికి తేవాలని కలెక్టర్‌ సూచించారు. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడైనా డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలితే తక్షణ వైద్య సేవలు అందించేలా అన్ని ఆసుపత్రులు, పీహెచ్‌సిల పరిధిలో సన్నద్ధమై ఉండాలని, ప్రజల అవసరాలకు సరిపడా మందులు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

మలేరియా వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు వీలుగా పీహెచ్‌సీల పరిధిలో నూటికి నూరు శాతం నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా సాంపిల్స్‌ సేకరించి పరీక్షల నిమిత్తం పంపించాలని ఆదేశించారు. ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించిన ఎడపల్లి పీహెచ్‌సి వైద్యాధికారితో పాటు మొత్తం సిబ్బందికి మెమోలు జారీ చేయాలని కలెక్టర్‌ సంబంధిత అధికారిని ఆదేశించారు.

కాగా, ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పుల సంఖ్య కొంతవరకు పెరిగినప్పటికీ, మరింత చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి గర్భిణీ వివరాలను మొదటి మూడవ మాసంలోనే తప్పనిసరిగా నమోదు చేస్తూ, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలా పర్యవేక్షణ చేయాలన్నారు. అవుట్‌ పేషంట్ల సంఖ్య ప్రతిరోజు క్రమంగా పెరిగేలా చూసుకోవాలని, నాణ్యమైన వైద్య సేవలందిస్తే ప్రజలు తప్పక ప్రభుత్వాసుపత్రులకు వస్తారని అన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది అందరు విధిగా ఆన్లైన్‌ విధానంలోనే హాజరు నమోదు చేయాలని, దీని ఆధారంగానే జీతాల చెల్లింపు జరగాలని కలెక్టర్‌ మరోమారు స్పష్టం చేశారు.

కేవలం ఉదయం వేళలోనే కాకుండా, మధ్యాహ్నం హాజరును కూడా పరిశీలించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సలకు చొరవ చూపాలన్నారు. దీని ద్వారా ప్రభుత్వం నుండి వచ్చే ఇన్సెంటివ్‌ మొత్తాన్ని సంబంధిత వైద్యులు ఇతర ప్రాంతానికి బదిలీ అయినా, లేక పదవీ విరమణ చేసిన తరువాత కూడా వారికే అందించేలా చూసే బాధ్యత తనదేనని కలెక్టర్‌ భరోసా కల్పించారు. వీడియో కాన్ఫరెన్సులో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ తుకారాం రాథోడ్‌, పీ.ఓ డాక్టర్‌ అంజన తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »