నిజామాబాద్, జూలై 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల వివరాలను పూర్తి స్థాయి గణాంకాలతో పక్కాగా అందించాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ ప్రగతి భవన్లో ఎం.పీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది.
కలెక్టర్ సి.నారాయణరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్ తదితరులు పాల్గొన్నారు. అజెండా అంశాలపై చర్చ సందర్భంగా ఎం.పీ అర్వింద్ మాట్లాడుతూ, ఆయా పథకాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిష్పత్తిలో నిధులు కేటాయిస్తున్నాయి, ఎన్ని పనులు గ్రౌండిరగ్ జరిగాయి, వాటిలో ఎన్ని పూర్తయ్యాయి వంటి వివరాలను అజెండాలో స్పష్టంగా పొందుపర్చాలని అన్నారు. ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులందరూ ప్రీమియం చెల్లించేలా చూడాలని, దీని వల్ల పంటలు నష్టపోయినప్పుడు పరిహారం పొందేందుకు వీలుంటుందని అన్నారు.
కేంద్రం సమకూరుస్తున్న నిధులతో కొనసాగుతున్న చెక్ డ్యామ్ ల నిర్మాణాలు నాణ్యతతో జరిగేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. గతేడాది బాల్కొండ నియోజకవర్గంలో రెండు చెక్ డ్యామ్ లు ధ్వంసం కావడం వల్ల పంటలు కోల్పోయిన రైతులకు త్వరిత గతిన నష్ట పరిహారం ఇప్పించేందుకు చొరవ చూపాలన్నారు. మధ్యాన్నభోజనం అమలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, నిర్ణీత మెనూను అనుసరిస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం కింద తప్పనిసరిగా గుడ్లు అందించాలని సూచించారు. కాగా, జిల్లాలో సుమారు రెండు వందల మందికి ఉగ్ర శిక్షణ అందించేందుకు ప్రయత్నించిన నిషేధిత సంస్థకు చెందిన వ్యక్తి ఇటీవల పోలీసులకు పట్టుబడ్డాడని, ఇదివరకు కూడా బోధన్ కేంద్రంగా నకిలీ పాస్ పోర్టులు వెలుగు చేశాయని ఎం.పీ అర్వింద్ ఆందోళన వెలిబుచ్చారు.
ఈ తరహా కార్యకలాపాలను తీవ్రంగా పరిగణిస్తూ ఉక్కుపాదంతో అణిచివేసేందుకు జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే, జిల్లాలో గంజాయి వినియోగం, స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ, గంజాయి సాగు, అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసు, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయని చెప్పారు. అవసరమైతే రెవెన్యూ శాఖను కూడా భాగస్వామ్యం చేస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎం.పీని భాగస్వామ్యం చేయడం లేదని పలువురు సభ్యులు ప్రస్తావించగా, కలెక్టర్ ఖండిరచారు.
ప్రతి కార్యక్రమానికి తప్పనిసరిగా ఆహ్వానిస్తూ సమాచారం పంపిస్తున్నామని, ప్రొటోకాల్ పక్కాగా అమలయ్యేలా చూస్తున్నామని స్పష్టం చేశారు. ఎక్కడైనా ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగితే బాధ్యులైన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా మీదుగా వెళ్తున్న 44 , 63 జాతీయ రహదారులకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటిస్తున్నామని, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భాగస్వాములు కావాలని కోరారు. బోధన్ లోని నిజాం చక్కర కర్మాగారంకు చెందిన స్థలాల్లోనూ మొక్కలు నాటడం జరుగుతోందని, ఒకవేళ ప్రభుత్వం ఈ స్థలాలను అర్హులైన వారికి పంపిణీ చేస్తే జిల్లా యంత్రాంగానికి ఎలాంటి అభ్యంతరం ఉండబోదని తెలిపారు.
ఇదివరకు పలు కుటుంబాలకు ప్రభుత్వం అందించిన ఎన్.ఎస్.ఎఫ్ భూములను తమ అవసరాల రీత్యా విక్రయించుకుంటామని పలువురు లబ్ధిదారులు జిల్లా యంత్రాంగానికి చేసిన విజ్ఞప్తి మేరకు అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలకు వివిధ అవసరాల నిమిత్తం మిగులు స్థలాలను అందుబాటులోకి తేవాలనే సదుద్దేశ్యంతో నీటి పారుదల శాఖ పరిధిలోని ఆయా జలాశయాలకు చెందిన కాలువల హద్దులను నిర్ధారణ చేయించి బండ్ నిర్మింపజేస్తున్నామని కలెక్టర్ సభ్యులకు వివరించారు.
హరితహారంలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఈ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించామని అన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి చందర్, జెడ్పి సీఈఓ గోవింద్, వివిధ శాఖల అధికారులు, దిశా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.