ఎడపల్లి, జూలై 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 31 రైల్వే స్టేషన్లను ఆదాయం లేదనే సాకుతో తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఎడపల్లి రైల్వే స్టేషన్‌ను అధికారులు మూసివేశారని, మూసివేసిన ఎడపల్లి రైల్వే స్టేషన్‌ను ఎంపి ప్రత్యేక చొరవ తీసుకొని పునరుద్దరణ చేయాలని కోరుతూ ఎడపల్లి మండల బిజెపి ఆధ్వర్యంలో బుధవారం ఎంపి అర్వింద్ ధర్మపురికి వినతి పత్రం అందజేశారు.
ప్యాసింజర్ల ప్రయాణం, ఆదాయం లేని కారణం చెబుతూ ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని ఎడపల్లి నుంచి వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగులకు వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రజలకు అనుకూలంగా ఉండే రైల్వే స్టేషన్‌ను తిరిగి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎడపల్లి మండలంలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్ళాలంటే ఆర్‌టిసి బస్సు ప్రయాణంలో సుమారు వెయ్యి రూపాయల వరకు ఖర్చవుతుందని, అదే రైలు ద్వారా వెళితే రెండు నుండి మూడు వందల్లో వెళ్ళి తిరిగి రావచ్చన్నారు.
పేద, మధ్య తరగతి వారికి ఇది భారంగా మారనుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎడపల్లి ఓ హబ్‌గా మారనున్న తరుణంలో రైల్వే స్టేషన్ మూసివేత మండలానికి పెద్ద దెబ్బ అని రైల్వే స్టేషన్ భవనాన్ని గతంలో ఉన్న వైపు కాకుండా ప్రయాణీకులకు అనుకూలంగా ఉందే విధంగా మరోవైపు నిర్మించేందుకు స్టేషన్ పునరుద్దరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపిని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో బిజెపి మండల అధ్యక్షుడు కమలాకర్‌రెడ్డి, ఓబిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింగ్, సృజన్, మల్లెపూల శ్రీనివాస్, అభినవ్, పవన్, శివ, చైతన్య, సాయికుమార్, లక్ష్మణ్‌గౌడ్ తదితరులు ఉన్నారు.