నిజామాబాద్, జూలై 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు దాతల తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని కోరుకున్న ప్రభుత్వ కొలువు సాధించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి హితవు పలికారు. ఈనాడు/ఈటీవీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ఉపయోగార్థం దాతల నుండి సుమారు 7.50 లక్షల రూపాయల విలువ చేసే స్టడీ మెటీరియల్ సేకరించి లైబ్రరీలకు సమకూర్చారు.
ఇందులో భాగంగానే శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి మూడున్నర లక్షల రూపాయల విలువ చేసే పుస్తకాలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజానికి ఉపయుక్తంగా నిలిచే కార్యక్రమాలు చేపట్టడంలో ఈనాడు సంస్థ ముందంజలో ఉంటుందని కొనియాడారు. జిల్లాలో అనేక మంది దాతలు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత భోజనం, కోచింగ్, వసతి, స్టడీ మెటీరియల్స్ తదితర రూపంలో తోడ్పాటును అందిస్తున్నారని అన్నారు.
దీనిని అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని, ఉద్యోగాలు సాధించడం ద్వారా దాతలకు సంతృప్తి లభించేలా చేయాలన్నారు. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున వ్యయప్రయాసాలు కోర్చి శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఏమాత్రం తీసిపోకుండా స్థానికంగా కూడా ఇక్కడి అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ, మెటీరియల్ అందేలా కృషి చేశామని, అభ్యర్థులు అత్యధిక కొలువు సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని, వ్యక్తిగతంగా కూడా ఉద్యోగ భద్రతతో కూడిన సంతోషకర జీవితానికి బాటలు వేసుకోవాలని కలెక్టర్ ఉద్బోధించారు. కార్యక్రమంలో టీఎన్‌జీఓల సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కిషన్, అమృత్ కుమార్, ఈనాడు యూనిట్ ఇంచార్జి చక్రవర్తి, ఈనాడు, ఈటీవీ జిల్లా ప్రతినిధులు వెంకటేశ్వర్లు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.