మొక్కలు లేని రోడ్డు కనిపిస్తే కార్యదర్శిపై సస్పెన్షన్‌ వేటు

నిజామాబాద్‌, జూలై 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా మీదుగా వెళ్తున్న 44, 63 వ నెంబర్‌ జాతీయ రహదారులు మొదలుకుని అన్ని మార్గాల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు ఉండాలని, ఎక్కడైనా మొక్కలు కనిపించకపోతే సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేస్తామని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి హెచ్చరించారు. హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నందున నిర్దేశిత స్థలాల్లో విరివిగా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హరిత హారం, మన ఊరు – మన బడి, పల్లె ప్రగతి పనులు తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, హరితహారంలో భాగంగా కేటాయించిన లక్ష్యం మేరకు పూర్తి స్థాయిలో మొక్కలు నాటేలా కృషి చేయాలన్నారు. వచ్చే సోమవారం నుండి ప్రతి రోజు కనీసం పది శాతానికి తగ్గకుండా మొక్కలు నాటాలని, ఈ వారం రోజులను ప్రత్యేకంగా మొక్కలు నాటే వారంగా పరిగణించాలని సూచించారు.

ఈ ప్రక్రియను గ్రామపంచాయతీ వారీగా నిశితంగా పర్యవేక్షణ చేస్తామని అన్నారు. మొక్కలను ఎక్కడబడితే అక్కడ నాటకూడదని, రహదారులకు ఆనుకుని ఇరువైపులా ఖాళీ స్థలాల్లో వరుస క్రమంలో మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనంతరం ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు చెందిన ఖాళీ స్థలాల్లో, పల్లె ప్రకృతి, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులు, వైకుంఠ ధామాలలో మొక్కలు నటించాలని సూచించారు. ఈసారి విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, రైతు వేదికల వద్ద హరితహారం అమలు పక్కాగా జరిగేలా దృష్టి సారించాలన్నారు.

ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో పది ఎకరాల అటవీ విస్తీర్ణంతో పాటు, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసుల పరిధిలో పది హెక్టార్ల విస్తీర్ణంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని ఆదేశించారు. ముందుగా మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టిన తరువాతే మొక్కలు నాటించాలని, దీని వల్ల నాటిన మొక్కలు కాపాడుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. చిన్నాపూర్‌ అర్బన్‌ పార్కులో మొక్కలు నాటే ప్రక్రియను వారం వ్యవధిలో పూర్తి చేయాలని గడువు విధించారు.

కాగా, ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న ఫార్మేషన్‌ రోడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తెలంగాణా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరించాలని, మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కింద ఆయా పాఠశాలల్లో చేపడుతున్న ప్రహరీలు, కిచెన్‌ షెడ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, జిల్లా పరిషత్‌ సీఈఓ గోవింద్‌, డీఆర్‌డీఓ పీడీ చందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »