నిజామాబాద్, జూలై 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన నిత్యజీవితంలో భాగంగా మారిన ప్లాస్టిక్ సంచుల స్థానంలో బట్ట సంచులు వాడి పర్యావరణాన్ని రక్షించుకుందామని మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షురాలు డా. జయనీ నెహ్రూ పిలుపునిచ్చారు. జనవిజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం ట్రస్ట్ సంయుక్తంగా పంపిణీ కోసం తయారుచేసిన బట్ట సంచులను శుక్రవారం ఖలీల్‌వాడి స్వగృహంలో ఆమె విడుదల చేసారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రైనేజీల్లో పేరుకు పోయిన ప్లాస్టిక్ సంచులతో ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా ఉందని, తక్షణమే ఒక ఉద్యమంగా వాటిని తొలగించి శుభ్రం చేయకపోతే డెంగ్యూ లాంటి జబ్బులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జేవీవీ జాతీయ గౌరవాధ్యక్షులు డా. రామ్మోహనరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ బ్యాగులు భూమిలో కలిసిపోవని అవి భూసారాన్ని నాశనం చేస్తాయని, వాటిని తిని జంతువులు అనారోగ్యాల బారిన పడుతున్నాయని వివరించారు.
కార్యక్రమంలో జేవీవీ వ్యవస్థాపకుడు ప్రసాదరావు, నర్రా రామారావు, కే. రామ్మోహన్, రవీంద్రనాథ్ సూరి, విజయానందరావు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.