సమస్యల పరిష్కార వేదికలుగా రెవెన్యూ సదస్సులు

నిజామాబాద్‌, జూలై 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలువాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ఈ నెల 15 వ తేదీ నుండి ప్రారంభం కానున్న మండల స్థాయి రెవెన్యూ సదస్సులను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లకు దిశానిర్దేశం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆర్దీవోలు, ఆయా మండలాల తహశీల్దార్లతో సమావేశమై కీలక సూచనలు చేశారు.

సదస్సుల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి రెవెన్యూ అధికారులకు అవగాహన కల్పిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేశారు. రెవెన్యూ సదస్సులలో ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, సానుకూలంగా ఉన్న సమస్యలను సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. ఒకవేళ సమస్యను పరిష్కరించేందుకు నిబంధనలు అంగీకరించని పక్షంలో దరఖాస్తుదారుడికి ఆ విషయాన్ని స్పష్టంగా అర్ధమయ్యే రీతిలో తెలియజేయాలని అన్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తుదారులను పదేపదే తమవద్దకు తిప్పుకోకూడదని, సదస్సులో అర్జీలు అందించేందుకు వచ్చే వారితో సున్నితంగా వ్యవహరించాలని హితవు పలికారు. సదస్సు సందర్భంగా ప్రజలు సమర్పించే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, పూర్తి రికార్డుల ఆధారంగానే వాటిని పరిష్కరించాలని సూచించారు. ఈ రెవెన్యూ సదస్సులు ముగిసిన మీదట మళ్ళీ భూ సమస్యలంటూ ఎవరు కూడా ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే పరిస్థితి ఉండకుండా క్షేత్ర స్థాయిలోనే సదస్సుల్లో పరిష్కరించేందుకు వీలున్న సమస్యలన్నీ పరిష్కరించాలని అన్నారు.

అర్హులైన వారికి పూర్తి న్యాయం జరిగేలా సానుకూల దృక్పథంతో పని చేయాలని, అప్పుడే రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సార్థకత చేకూరి ప్రభుత్వ లక్ష్యం సాధించినట్లు అవుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఒక్కో మండలంలో మూడు రోజుల పాటు కొనసాగనున్న సదస్సుల కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్‌ వివరించారు. రెవెన్యూ సంబంధిత సమస్యలు, గ్రామాల సంఖ్యను బట్టి ఒక మండలంలో ఒక్కో రోజు ఎన్ని రెవెన్యూ గ్రామాలలో సదస్సులు నిర్వహించుకోవాలన్నది ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.

ప్రజలు, రైతులు సమర్పించే దరఖాస్తులను పరిష్కరించేందుకు వీలుగా రెవెన్యూ సదస్సు ప్రాంతంలోనే మొబైల్‌ ఈ- సేవ కేంద్రాలు, జిరాక్స్‌, మైక్‌, షామియానా, తాగునీటి వసతి వంటి ఏర్పాట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. సదస్సులలో దరఖాస్తుల పరిశీలన, తదితర పనులు నిర్వహించేందుకు అనుభవజ్ఞులైన సిబ్బందిని నియమించుకోవాలని, ఏ చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం కల్పించకూడదని కలెక్టర్‌ సూచించారు. రెవెన్యూ సదస్సులను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత తహసీల్దార్లదేనని స్పష్టం చేశారు.

వర్షాకాలం సీజన్‌ అయినందున రెవెన్యూ రికార్డులు పాడవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ గురించి ప్రజలందరికి తెలిసేలా ముందస్తుగానే విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, నిజామాబాద్‌, ఆర్మూర్‌ ఆర్దీవోలు రవి, శ్రీనివాసులు, కలెక్టరేట్‌ ఏ.ఓ ప్రశాంత్‌, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించాలి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌

కాగా, రెవెన్యూ సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్‌డిఓలు, తహశీల్దార్లతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ నెల 15 నుంచి చేపట్టనున్న మండల స్థాయి రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.

రెవెన్యూ సదస్సు షెడ్యూల్‌ ఖరారు చేసుకుని, దానికి అనుగుణంగా ఆయా రెవెన్యూ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ వేదికల వద్ద మొబైల్‌ ఈ-సేవా కేంద్రం, ఇంటర్నెట్‌, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ రెవెన్యూ సదస్సులలో అందే అన్ని దరఖాస్తులకు రసీదులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నెల 11న ముఖ్యమంత్రి నిర్వహించనున్నకలెక్టర్ల సమావేశానికి, జిల్లా అధికారులు అన్నిఅంశాలపై సమగ్ర సమాచారంతో రావాలని కోరారు.

Check Also

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనరంజక పాలన

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »