నిజామాబాద్, జూలై 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రముఖ వ్యాపార సంస్థ అయిన జోయాలుక్కాస్ తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రశంసించారు. సుభాష్ నగర్‌లోని బాలసదన్ లో వసతి పొందుతున్న నలభై మంది అనాధ బాలలకు జోయాలుక్కాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే సామాగ్రిని ఉచితంగా సమకూర్చారు.
బాలసదన్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు సామాగ్రిని పంపిణి చేశారు. దైనందిన జీవనంలో ఉపయోగపడే బెడ్లు, దుప్పట్లు, తలదిండులు, ట్రంకు పెట్టెలు, యూనిఫామ్, షూస్, స్కూల్ బ్యాగులు, కాస్మెటిక్స్, ఎత్తు, బరువును తూచే యంత్రాలు తదితర సామాగ్రిని బాలల కోసం సదన్ నిర్వాహకులకు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అవసరాల్లో ఉన్న వారిని గుర్తిస్తూ తోడ్పాటును అందించడం ఎంతో గొప్ప విషయమన్నారు. జోయాలుక్కాస్ సంస్ధ మునుముందు కూడా మరింత పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రత్యేకించి అనాధ బాలలు, గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు చేయూతను అందిస్తే వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసినట్లు అవుతుందన్నారు.
ఈ దిశగా జోయాలుక్కాస్ సంస్థ చైర్మన్ చొరవ చూపుతారని ఆశిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. కాగా జోయాలుక్కాస్ ఫౌండేషన్ అందించిన వస్తువులను బాలలు నిత్యా జీవితంలో వినియోగించేలా చూడాలని బాలసదన్ సిబ్బందికి సూచించారు.
కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి రaాన్సీలక్ష్మి, చైతన్య కులకర్ణి, నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్, జోయాలుక్కాస్ ప్రాంతీయ మేనేజర్ రాబిన్ తంబీ, స్థానిక మేనేజర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.