కామారెడ్డి, జూలై 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 15వ తేదీ నుంచి జరగనున్న రెవెన్యూ సదస్సుల కోసం జిల్లా యంత్రాంగాన్ని అన్ని విధాలుగా సన్నద్ధం చేసామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రెవిన్యూ సదస్సుల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్‌డిఓలు, ఇతర రెవెన్యూ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్ , జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రమోహన్, వెంకటేష్ ధోత్రే, రెవెన్యూ డివిజన్ అధికారులు శీను, రాజా గౌడ్, అన్ని మండలాల తాసిల్దారులు కామారెడ్డి కాన్ఫరెన్స్ హాల్ నుంచి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రెవెన్యూ సదస్సుల నిర్వహణ కోసం సన్నద్దతను ప్రధాన కార్యదర్శికి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ… ఈ నెల 15 నుంచి నిర్వహించే మండల స్థాయి రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లాకలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
రెవెన్యూ సదస్సు షెడ్యూల్ లపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ వేదికల వద్ద మొబైల్ ఈ-సేవా కేంద్రం, ఇంటర్నెట్, ఇతర మౌలిక సదుపాయాలు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ రెవిన్యూ సదస్సులలో అందే అన్ని దరఖాస్తులకు రసీదులు ఇవ్వాలని స్పష్టం చేశారు.. ఈ నెల 11న ముఖ్యమంత్రి నిర్వహించనున్నకలెక్టర్ల సమావేశానికి, జిల్లా అధికారులు అన్ని సమగ్ర సమాచారంతో రావాలని కోరారు.
ధరణి పోర్టల్‌లో పెండిరగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
జిల్లాలో ధరణి పోర్టల్‌లో పెండిరగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తాసిల్దార్లను ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల ప్రారంభంలోపే ఒక్క దరఖాస్తు కూడా ధరణి పోర్టల్‌లో పెండిరగ్ ఉండొద్దని జిల్లా కలెక్టర్ సూచించారు.