నిజామాబాద్, జూలై 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏకధాటిగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలలో కలెక్టర్ సి నారాయణ రెడ్డి శనివారం పర్యటించారు. జలమయంగా మారిన ప్రధాన రహదారులు, కూడళ్లను పరిశీలించి, క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న పరిస్థితులను సమీక్షించారు. బోధన్ రోడ్, అర్సపల్లి ఎక్స్ రోడ్, బైపాస్ రోడ్, న్యూ కలెక్టరేట్, కంటేశ్వర్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్, తన వెంట ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నందున ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలీస్, నగరపాలక సంస్థ అధికారులు పరస్పరం సమన్వయంతో పని చేస్తూ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. భారీ వర్షాలకు పలు ప్రధాన రహదారులపై పెద్ద ఎత్తున వర్షపు జలాలు నిలిచినందున వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని సూచించారు.
వర్షాల ధాటికి ఎక్కడైనా రోడ్లు దెబ్బతింటే తక్షణమే వాటికి మరమ్మత్తు లు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. ముఖ్యంగా పురాతన ఇండ్లు, శిథిలావస్థకు చేరిన గృహాల్లో నివాసం ఉంటున్న వారు తక్షణమే సమీపంలో ఉండే కమ్యూనిటీ భవనాలు, పాఠశాల భవనాల్లో ఆశ్రయం పొందాలని, ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.
వర్షాల కారణంగా ఎక్కడైనా సమస్యలు ఏర్పడితే, కలెక్టరేట్లో నెలకొల్పిన కంట్రోల్ రూమ్ కు లేదా నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లకు సమాచారం అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులు ఉన్నారు.