నిజామాబాద్, జూలై 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజల పునరావాస కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని, లోతట్టు ప్రాంతాలలో చేరే నీటిని ఎప్పటికప్పుడు మళ్లించాలని నగర మేయర్ నీతుకిరణ్ ఆదేశించారు. మంగళవారం ఆమె వరద పరిస్థితులపై సుమీక్షించారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ కంట్రోల్ రూమ్‌లో అందరూ అందుబాటులో ఉండాలని శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లపై వస్తున్న నీటిని ఎప్పటికప్పుడు మళ్లిస్తు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేపట్టిన చర్యలు సఫలం అయ్యాయని, ఇంతకు మించి ఇంకా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున శిథిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని, వర్షాల వల్ల విషజ్వరాలు కూడా ప్రబలే అవకాశం ఉన్నందున త్రాగు నీటిలో మురికి నీరు కలవకుండా ఏదైనా నీటి పైప్ లైన్ మరమ్మతులు ఉన్నట్లయితే వెంటనే గుర్తించి అరికట్టాలని అధికారులకు ఆదేశించారు.
నగరంలో ఎటువంటి పరిస్థితులనైనా ఎదురుకోవటానికి మున్సిపల్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మున్సిపల్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఇంజినీర్ హరికిషోర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఆనంద్ సాగర్, ముస్తాక్ అహ్మద్, సుదర్శన్, ఇంజినీర్లు వాజిద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.