నిజామాబాద్, జూలై 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సెల్ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని శాఖల అధికారులను కలెక్టర్ సి నారాయణ రెడ్డి అప్రమత్తం చేశారు. ఎక్కడ కూడా భారీ వర్షాల వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. లోతట్టు మార్గాలు, వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల మీదుగా రాకపోకలను పూర్తిగా నిషేధించాలని, అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
పురాతన కాలంనాటి, శిథిలావస్థకు చేరిన ఇళ్ళలో ఉంటున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ సూచించారు. నివాస ప్రాంతాల నడుమ వర్షపు నీరు నిల్వకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాలకు ఆస్కారం లేకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ట్రాన్స్కో ఎస్‌ఈ రవీందర్‌ను కలెక్టర్ ఆదేశించారు.
పాత భవనాలలో కొనసాగుతున్న వసతిగృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులను సురక్షితంగా ఉన్న హాస్టళ్లలోకి మార్చాలని ఆదేశాలు జారీచేశారు. పంట నష్టాన్ని నివారించేందుకు రైతులను అవగాహన కల్పిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులకు ఇప్పటికే సూచనలు చేశామని, చెరువులన్నీ పూర్తిస్థాయి నీటిమట్టాన్ని సంతరించుకున్నందున ఎక్కడ కూడా గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను నిశితంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. రేపటి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు.