నిజామాబాద్, జూలై 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు…. అధిక వర్షాల నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి ఇరు జిల్లాల కలెక్టర్లతో బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్లో సమీక్షించారు. ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రయాణాలు రద్దు చేసుకోవాలని కోరారు.
అలుగు పారుతున్న చెరువుల వద్దకు, పొంగిపొర్లుతున్న కల్వర్టుల వద్దకు కొంత మంది ఆసక్తితో చూడడానికి వెళ్తారని,ఇట్లాంటి సమయంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున వారిని నియంత్రించాలని తెలిపారు. అన్ని శాఖలను ఎప్పటికప్పుడు సమన్వయం చేయాలన్నారు. గ్రామ స్థాయిలో తహిసిల్దార్ లను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. చెరువుల వద్ద, కల్వర్టుల వద్ద,ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్న చోట్ల అయా గ్రామ విఆర్‌ఏలను ఉంచి ప్రమాదాలు నిలువరించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెరువులు, కుంటలు, డ్యాంల వద్ద ఇరిగేషన్ సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలన్నారు.
విద్యుత్ శాఖ సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఒరిగిన కరెంట్ స్థంబాలు,తెగిపోయిన,వేలాడే కరెంట్ తీగల పట్ల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరం ఉన్న చోట వెంటనే మరమ్మత్తులు చేపట్టాలన్నారు. ప్రజలు కూడా విద్యుత్ స్థంబాల వద్దకు వెళ్లకుండా స్వీయ జాగ్రత్తలు పాటించాలని కోరారు.
విద్యుత్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు, సిబ్బంది గ్రామ స్థాయిలో 24 గంటల పాటు అలెర్ట్‌గా ఉండాలని చెప్పారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ పరిధిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షించాలని ఇరు జిల్లాల కలెక్టర్లకు సూచించారు.