వేల్పూర్, జూలై 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు,నాయకులతో శుక్రవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ లోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశ మయ్యారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదలకు తమ తమ గ్రామాల్లో దెబ్బతిన్న చెరువులు, పంచాయితీ రాజ్ మరియు ఆర్‌అండ్‌బి పరిధిలోని రోడ్లు,బ్రిడ్జిలు, కల్వర్టులు మరియు కరెంట్ స్థంబాలు, ట్రాన్స్ఫార్మర్లు పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.
వర్షాలు,వరదలు కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత తెగిపోయిన చెరువులు,రోడ్లు,బ్రిడ్జిలు, కల్వర్టుల తాత్కాలిక పునరుద్ధరణ పనులు, ఎలక్ట్రిసిటీకి సంబందించిన మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు. శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టడానికి కావలసిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
వర్షాలు ప్రస్తుతానికి కొంత శాంతించిన..మళ్ళీ వస్తే గనుక స్థానిక ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు. సమావేశంలో ఆయా మండలాలకు చెందిన ఎంపిపిలు, జడ్పీటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, టిఆర్‌ఎస్ మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.