హైదరాబాద్, జూలై 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ స్థాయిలో ఉస్మానియా విశ్వివిద్యాలయం మరో గుర్తింపు సాధించింది. జాతీయ స్థాయి విద్యాసంస్థలు, యూనివర్శిటీల జాబితాలో తనస్థానాన్ని మరింత మెరుగు పరుచుకుంది. గతేడాదితో పోలిస్తే పది స్థానాలు మెరుగుపరుచుకుని 22వ స్థానాన్ని సాధించింది. 2022కు గాను కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేసిన అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలో చోటు సంపాందించుకుంది.
మొత్తం ఐదు విభాగాల్లో ఆయా విద్యాసంస్థలు సాధించిన ప్రగతి ఆధారంగా ఎంహెచ్‌ఆర్డీ కోర్ కమిటీ అధ్యయనం చేసింది. బోధన, అభ్యాసం, వనరులు… పరిశోధన, వృత్తి నైపుణ్యపద్దతులు…. పట్టభద్రతా సాఫల్యం… భిన్న వర్గాలకు అందుబాటులో ఉండటం… సమాజం పట్ల విద్యాసంస్థ అవగాహన అంశాల ఆధారంగా విద్యాసంస్థలకు ర్యాంకింగ్‌లు ఇచ్చారు.
కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పోటీ ఉస్మానియా మెరుగైన స్థానాన్ని సాధించింది. ఏడాది కాలంగా ఉస్మానియా యూనివర్శిటీలో చేపట్టిన సంస్కరణలు ఫలితాన్నిచ్చాయని ఉస్మానియా ఉపకులపతి ప్రొఫెసర్ డి. రవిందర్ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, విద్యాశాఖ ఏర్పాటుచేసిన కోర్ కమిటీ అధ్యయనంలో ఉస్మానియాకు గుర్తింపు దక్కడం తమ బాధ్యతను మరింత పెంచిందని గుర్తు చేశారు.
ఈ ఫలితం విద్యార్థులు, అధ్యాపకులతో పాటు నాన్ టీచింగ్ సిబ్బంది నిరంతర కృషి వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. వందేళ్లలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ విద్యాకేంద్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరం శ్రమిద్దామని పిలుపునిచ్చారు.