నిజామాబాద్, జూలై 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వివిధ రోగాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. దోమలు, ఈగలు పెరగడం వలన మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. అక్కడక్కడా డెంగీ కేసులు కూడా నమోదవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీనిపై తక్షణంగా చర్యలు తీసుకోవాలని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ గౌరవాధ్యక్షులు డాక్టర్ జయనీ నెహ్రు, జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ రామ్మోహన్రావు, మల్లు స్వరాజ్యం ట్రస్ట్ నాయకులు ప్రసాదరావు, ఈవీఎల్ నారాయణ, డాక్టర్ సూరి, కె రామ్మోహన్ రావు తదితరులు శనివారం జిల్లా కలెక్టర్‌కు, డి.ఎం.హెచ్ .ఓ. కు విజ్ఞాపన పత్రాలు సమర్పించారు.
ప్రజలు అనారోగ్య బారిన పడకుండా తక్షణమే చర్యలు చేపట్టుటకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేయవలసినదిగా వారు కోరారు. దీనితో పాటుగా ప్రజలను జాగృత పరచడం, దోమలు, ఈగలు పెరుగుదలకు దోహదపడే స్థలాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
అలాగే స్థానిక సంస్థల ద్వారా ఫాగింగ్ చేయించడం, ఆహార పదార్థాలు అమ్మే దుకాణాలు, హోటళ్లు, మార్కెట్లు అధికారులు తనిఖీ చేయాలన్నారు. ఫిల్ల్టర్ మంచినీరు సరఫరా ప్రదేశాలను, వాటర్ ప్లాంటులను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడం, పిల్లలు, వృద్ధులు, గర్బిణులు, బాలింతలు, వ్యాధిగ్రస్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవిధంగా ఆరోగ్య కార్యకర్తలకు అదేశాలు జారీ చేయాలని, ఆసుపత్రులలో సీజనల్ వ్యాధులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని వారు కోరారు.