యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలి

నిజామాబాద్‌, జూలై 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న సదుపాయాలను పునరుద్ధరించేందుకు ఆయా శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల ప్రగతిని కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి శనివారం సమీక్షించారు. సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, వ్యవసాయ, ట్రాన్స్‌కో తదితర శాఖల అధికారులను క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఒక్కో శాఖ వారీగా చేపడుతున్న పనుల గురించి ఆరా తీశారు.

భారీ వర్షాల వల్ల జిల్లాలో 14చోట్ల ఆర్‌అండ్‌బి రోడ్లు దెబ్బతిన్నగా, ఇప్పటికే వాటిలో 10 చోట్ల రాకపోకలను పునరుద్ధరించడం జరిగిందని సంబంధిత శాఖ అధికారులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. మిగతా ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి ఉన్నందున మరమ్మత్తు పనులు చేపట్టేందుకు ఆటంకం ఎదురవుతోందని అన్నారు. వరద జలాలను పంపింగ్‌ ద్వారా బయటకు తోడి యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మరమ్మత్తులు జరిపించాలని కలెక్టర్‌ ఆదేశించారు. పూర్తిస్థాయి మరమ్మతులకు అంచనాలు రూపొందించి సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని సూచించారు.

పంచాయతీరాజ్‌ పరిధిలోని రోడ్లను సైతం త్వరితగతిన మరమ్మత్తులు జరిపించి అన్ని ప్రాంతాలకు రాకపోకలు పునరుద్ధరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. కాగా వర్షాల తాకిడికి జిల్లాలో విద్యుత్‌ వ్యవస్థకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని కలెక్టర్‌ పేర్కొన్నారు. 468 విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయని, 198 ట్రాన్స్‌ఫార్మర్లు గోదావరి నదీ ప్రవాహం నీటిలో చిక్కుకుని ఉన్నాయని, మరో నాలుగు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయని ట్రాన్స్‌కో ఎస్‌ఈ రవీందర్‌ కలెక్టర్‌కు వివరించారు.

అయితే మరింత పెద్ద ఎత్తున విద్యుత్‌ స్తంభాలు, కరెంట్‌ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నట్టు క్షేత్రస్థాయి నుండి తమకు సమాచారం ఉందని కలెక్టర్‌ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఏమాత్రం విరామం లేకుండా విద్యుత్‌ పునరుద్ధరణ పనులు జరిగేలా చూడాలని హితవు పలికారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ, అధికారులు మొదలు కిందిస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నం కావాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రధానంగా వ్యవసాయ క్షేత్రాలకు విద్యుత్తు సరఫరా యధా స్థాయికి చేరేలా చొరవ చూపాలన్నారు.

సోమవారం నాటికి జిల్లా వ్యాప్తంగా అన్నిచోట్ల విద్యుత్‌ సరఫరా సాధారణ స్థాయికి వచ్చేలా వేగవంతంగా మరమ్మతు పనులను జరిపించాలని సూచించారు. ఇప్పటికిప్పుడు పంటలకు సాగునీటి ఆవశ్యకత అవసరం లేకపోయినప్పటికీ, మరో నాలుగైదు రోజుల తర్వాత అవసరం ఏర్పడుతుందన్నారు. అలాంటి పరిస్థితుల్లో విద్యుత్‌ సమస్య నెలకొని ఉంటే రైతులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నందున పునరుద్ధరణ పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్‌ హితవు పలికారు.

ట్రాన్స్‌కో ఏఈలు, లైన్‌ ఇన్స్పెక్టర్లు రైతు సమన్వయ సమితి సభ్యులతో కలిసి ఒక్కో లైన్‌ వారీగా విద్యుత్‌ సరఫరా దెబ్బతిన్న చోట తక్షణమే పునరుద్ధరణ పనులను జరిపించాలన్నారు. వ్యవసాయ విస్తీర్ణ అధికారులు కూడా తమ తమ పరిధిలో విద్యుత్‌ పునరుద్ధరణ పనులను పరిశీలించాలని, ఎక్కడెక్కడ పనులు జరిగాయి, ఇంకా ఎన్ని పెండిరగ్లో ఉన్నాయో వివరాలు అందించాలని కలెక్టర్‌ ఆదేశించారు. సెల్‌ కాన్ఫరెన్సులో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »