నిజామాబాద్, జూలై 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించడం లేదనీ యువతి బంధువు ఆమె గొంతు కోసిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం చిన్నాపూర్ గ్రామానికి చెందిన యువతికి మాక్లూర్ మండలం మాణిక్ భందడార్కు చెందిన సుంకరి సంజయ్ కుమార్ దూరపు బందువు.
అయితే సంజయ్ తనను ప్రేమించాలని యువతిని కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఆమె అందుకు నిరాకరించడంతో ఉన్మాదిగా మారాడు. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో యువతి ఇంటికి వచ్చిన సంజయ్ ఆమెతో గొడవపడి గొంతుకోశాడు. యువతి రోడ్డుపైకి వచ్చి అరుపులు, కేకలు వేయడంతో సంజయ్ పారిపోయాడు. గమనించిన స్తానికులు యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా మోపాల్ పోలీసులు సంజయ్‌ని శనివారం అరెస్టు చేశారు.