నిజామాబాద్, జూలై 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల నష్టం వాటిల్లిన వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం గురువారం పర్యటించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్ రాయ్ నేతృత్వంలో దీప్ శేఖర్ సింఘాల్, కృష్ణ ప్రసాద్ లతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి వరదలతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. వారి వెంట జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కేంద్ర బృందం సభ్యులకు వరదల వల్ల వాటిల్లిన నష్టం గురించి వివరించారు.
స్థానిక ప్రజాప్రతినిధులు, బాధిత రైతులు సైతం కేంద్ర బృందాన్ని కలిసి వరదల వల్ల సంభవించిన నష్టం, ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఏకరువు పెట్టారు. నిరంతరాయంగా కురిసిన వర్షాలకు నీట మునిగిన పంటలు, తెగిన చెరువులు, కొట్టుకుపోయిన రోడ్లను పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు నష్టం వివరాలను ఆయా ప్రాంతాల వారీగా నమోదు చేసుకున్నారు. ముందుగా వరద ఉదృతికి కొట్టుకుపోయిన జక్రాన్పల్లి మండలం పడకల్ పెద్దచెరువు పరిశీలించారు. చెరువు కింద 527 ఎకరాల విస్తీర్ణంలో పంటలు నీట మునిగాయని, కట్ట తెగిపోవడం వల్ల కేశ్‌పల్లి, కోరటపల్లి, దర్పల్లి గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడిరదని కలెక్టర్ నారాయణరెడ్డి కేంద్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు.
అనంతరం కేంద్ర బృందం మనోహరాబాద్ – కలిగోట్ గ్రామాల మధ్యన కొట్టుకుపోయిన రోడ్డు, ఇదే మార్గంలో వరద నీటిలో మునిగి ఇసుక మేటలు వేసిన వరి, మొక్కజొన్న, సోయా, పసుపు పంటలను పరిశీలించారు. ఆర్మూర్ మండలం పిప్రి వద్ద దెబ్బతిన్న లోలెవెల్ వంతెన, కాజ్ వే ను సందర్శించారు. వేల్పూరు మండలం జానకంపేట్ పెద్దవాగులో వరద తాకిడికి పూర్తిగా ధ్వంసమైన చెక్ డ్యామ్, మోర్తాడ్ మండలం దొన్ పాల్ వద్ద పూర్తిగా దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్డు, దోంచంద వద్ద నష్టపోయిన పంటలను, ధ్వంసమైన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ లను పరిశీలించారు.
కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆయా శాఖల అధికారులు ఆద్యంతం కేంద్ర బృందం వెంటనే ఉండి, వరద నష్టం వివరాలను క్షుణ్ణంగా తెలియజేశారు. వరద నష్టాన్ని అధ్యయనం చేసిన కేంద్ర బృందం పలు అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమగ్ర వివరాలతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని సభ్యులు పేర్కొన్నారు. కేంద్ర బృందం వెంట ఇరిగేషన్ ఎస్‌ఈ నారాయణ, ట్రాన్స్కో ఎస్‌ఈ రవీందర్, పంచాయతీ రాజ్ ఈ.ఈలు శంకర్, మురళి , తదితరులు ఉన్నారు.