నిజామాబాద్, జూలై 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా చార్జ్ షీట్ దాఖలు చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్ ప్రగతి భవన్‌లో కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా అట్రాసిటీ కేసుల పురోగతి పై డివిజన్‌ల వారీగా కలెక్టర్ సమీక్షించారు.
బాధితులకు సత్వర న్యాయం జరగాలంటే, పకడ్బందీగా దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలను సేకరించి చార్జ్ షీట్ ఫైల్ చేయాలన్నారు. అట్రాసిటీ కేసు నమోదైన మీదట అరవై రోజుల లోపే ఛార్జ్ షీట్ దాఖలు కావాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గడువు దాటకుండా దర్యాప్తు ప్రక్రియను పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. లేనిపక్షంలో రోజుల తరబడి కేసులు పెండిరగ్ ఉండిపోవడం వల్ల బాధితులు నిరుత్సాహానికి లోనవుతారని అన్నారు. ఎవరి వైపు న్యాయం ఉంటే వారికి తగిన న్యాయం జరిపించేందుకు కృషి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
అట్రాసిటీ కేసుల్లో వాస్తవంగానే నేరాలకు పాల్పడిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకుండా వారికి చట్టం పరిధిలో తగిన శిక్ష పడేలా చూడాలన్నారు. భూ సమస్యలు, భూ తగాదాలతో ముడిపడి ఉన్న కేసులకు సంబంధించి రెవిన్యూ అధికారుల నుండి నివేదికలు తెప్పించుకోవాలని, ఈ మేరకు రెవెన్యూ అధికారులు కూడా విచారణను వెంటదివెంట పూర్తి చేసి నివేదికలు పంపాలని కలెక్టర్ సూచించారు. బాధితులకు ప్రభుత్వం తరపున అందించాల్సిన ఆర్ధిక సహాయాన్ని సకాలంలో అందేవిధంగా చూడాలన్నారు.
పెండిరగ్ ట్రయల్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ సూచించారు. నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ల పరిధిలో దర్యాప్తు దశలో 15 చొప్పున కేసులు పెండిరగ్లో ఉన్నాయని, బోధన్ డివిజన్ పరిధిలో ఆరు కేసులు ఉన్నాయని తెలిపారు. అలాగే, పెండిరగ్ ట్రయల్‌లో నిజామాబాద్ డివిజన్ పరిధిలో 140, ఆర్మూర్ డివిజన్‌లో 55, బోధన్ డివిజన్లో 31 కేసులు ఉన్నాయని, తదుపరి నిర్వహించే విజిలెన్సు మానిటరింగ్ కమిటీ సమావేశం నాటికి వీటి పరిష్కారం విషయంలో పురోగతి కనిపించాలన్నారు.
కాగా, ఆర్మూర్ డివిజన్ పరిధిలో కొన్ని చోట్ల గ్రామాభివృద్ధి కమిటీలు ఎస్సీ, ఎస్టీ కుటుంబాల పై ఆంక్షలు విధిస్తున్నాయని సభ్యులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారు ఎవరైనాసరే ఎంతమాత్రం ఉపేక్షించకూడదని, నిబంధనకు అనుగుణంగా చట్ట పరిధిలో తప్పనిసరిగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెల చివరి రోజున అన్ని మండలాల్లో కనీసం ఏదైనా ఒక గ్రామంలో సివిల్ రైట్స్ డే ను తప్పనిసరిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
అస్పృశ్యత, అంటరానితనం, మూఢ నమ్మకాలు, రెండు గ్లాసుల పద్దతి వంటి సాంఘిక దురాచారాల పట్ల, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల గురించి ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించాలని హితవు పలికారు. సివిల్ రైట్స్ డే కార్యక్రమంలో ప్రజలు పాల్గొనేందుకు వీలుగా ముందస్తుగానే ముమ్మర ప్రచారం చేయాలన్నారు.
పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నప్పుడు కమిటీ సభ్యులు బాధితులకు వారు సరైన రీతిలో సమగ్రంగా అన్ని అంశాలతో ఫిర్యాదు చేసేలా కమిటీ సభ్యులు సహకారం అందించాలని సూచించారు.
పోలీస్ శాఖ తరపున బాధితులకు తప్పనిసరిగా పూర్తి న్యాయం జరిపించేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈ.డి శశికళ, ఏసీపీలు వెంకటేశ్వర్లు, ప్రభాకర్, రఘు, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్, శ్రీనివాసులుతో పాటు సంబంధిత శాఖల అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.