హైదరాబాద్, జూలై 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల నుండి నేరుగా గిరిజనులు సేకరించిన పుట్టు తేనెను, ఏ మాత్రం రసాయనాలతో ప్రాసెస్ చేయకుండా నేరుగా స్వచ్ఛమైన తేనే విక్రయాలను ‘‘గిరి నేచర్’’ అనే పేరుతొ తెలంగాణా గిరిజన సహకార సంస్థ ప్రారంభించింది. గిరిజన స్వచ్ఛమైన తేనే ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిష్టినా జోంగ్టు అందజేశారు.
తేనే ఉత్పత్తుల్లో మొదటిసారిగా మామిడి తేనే, వేప తేనే, నువ్వుల తేనే, పాల కొడిశ తేనే లను వేర్వేరుగా విక్రయిస్తోంది. రాష్ట్రంలో ఫ్లిప్ కార్డు, క్యూ- మార్ట్‌ల ద్వారా ఈ తేనే ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయవచ్చని క్రిస్టినా జోంగ్టు తెలిపారు. ఇప్పటివరకు గిరిజనులను ముఖ్యంగా చెంచు గిరిజనులు కిలో తేనే కు రూ. 220 లు పొందే వారని, దీనితో 54 శాతం అదనపు ఆదాయాన్ని పొందుతారని సి.ఎస్‌కు వివరించారు. కాగా, గిరిజనుల ఆదాయాన్ని పెంపొందించడమే కాకుండా ప్రజలకు మరింత స్వచ్ఛమైన తేనే ఉత్పత్తులను అందుబాటులో తేవడంపట్ల గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన సహకార సంస్థను అభినందించారు.
అడవుల్లో సేకరించిన ఈ మామిడి తేనే, వేప తేనే, నువ్వుల తేనే, పాల కొడిశ తేనే రకాల వేర్వేరు తేనే ఉత్పత్తులను ఏవిధమైన రసాయనాలతో ప్రాసెస్ చేయకుండా స్వచ్ఛమైన ఉత్పత్తులను అదేవిధంగా ప్రజలకు అందుబాటులో తేవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య పరమైన లాభాలుంటాయి. ఈ తేనేలు పాలీఫెనాల్స్ అని పిలువబడే విభిన్న బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుందని, ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, యాంటీ యాంటీఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, రోగనిరోధక శక్తిని పెంచే ప్రభావాన్ని కలిగి ఉంటాయన్నారు. జలుబు, గొంతు నొప్పి, చర్మ వ్యాధుల నివారణకు తేనే మంచి ఔషధంగా పనిచేస్తుందన్నారు.