కామారెడ్డి, జూలై 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డెంగీ, మలేరియా, అతిసారం వంటి వ్యాధులు వ్యాపించకుండా వైద్య సిబ్బంది , మండల స్థాయి అధికారులు గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో పారిశుద్ధ్యం, వైద్యం, తాగునీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు.
డెంగీ, మలేరియా లక్షణాలు ఉంటే వారికి పరీక్షలు చేయించి, సమీపంలోని ఏరియా ఆసుపత్రిలో అవసరమైన చికిత్సలు చేయించాలని సూచించారు. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చూడాలన్నారు. గ్రామాల్లో ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిలువ లేకుండా చూడాలన్నారు. దోమలు నిల్వ ఉండకుండా ప్రతి ఆదివారం ఫ్రైడే ను నిర్వహించాలన్నారు. అర్హత గల వారందరూ బూస్టర్ డోస్ తీసుకొని కరోనా రాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దయాకర్ రావు మాట్లాడారు. గ్రామాల్లో మురుగునీటి కాలువల్లో పూడిక ఉంటే తక్షణమే తొలగించాలని సూచించారు. తాగునీటి ట్యాంకుల పైప్ లైన్లు లీకేజీలు ఉంటే తక్షణమే పూడ్చాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగే విధంగా గ్రామాల్లో దండోరా (టామ్ టామ్) వేయించాలని అధికారులను ఆదేశించారు. హోటల్స్, కిరణ్ దుకాణాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలన్నారు. పరిశుభ్రత చర్యలు పాటించకపోతే యజమానులకు జరిమానా విధించాలని కోరారు. సీజనల్ వ్యాధులు రాకుండా అంగన్వాడి, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గ్రామస్థాయిలో వీరు ఇంటింటికి వెళ్లి పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాత భవనాల్లో తరగతి గదులు నిర్వహించవద్దని సూచించారు. విద్యార్థులకు ఫ్రైడే, డ్రై డే పై అవగాహన కల్పించాలని కోరారు. కరోనా రాకుండా అర్హత గల విద్యార్థులందరికీ వాక్సినేషన్ చేయించాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మంత్రులు కమలాకర్, సత్యవతి రాథోడ్, సిఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడారు.
వసతి గృహాల విద్యార్థులకు పౌష్టికాహారం అందే విధంగా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. డెంగీ వచ్చిన ఇంటికి 50 మీటర్ల దూరం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్రామాల్లో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రతి ఆదివారం ఇంటింటికి వెళ్లి ఇండ్ల లో ఉన్న పాత సామాగ్రిని తొలగించాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో ఉన్న టైర్లను, బాటిల్స్, కూలర్లను, కొబ్బరి చిప్పలను తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని మండల స్థాయి అధికారులకు తెలిపారు. రైస్ మిల్లర్లు రోజువారి లక్ష్యాలను మిల్లింగ్ చేయాలని సూచించారు.
మధ్యాహ్న భోజనాన్ని ప్రతిరోజు ప్రధానోపాధ్యాయుడు భోజనం చేసి తర్వాత విద్యార్థులకు భోజనాన్ని అందించాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో శానిటేషన్కు అవసరమైన వస్తువులను నిల్వ చేసుకోవాలని తెలిపారు. బ్లీచింగ్ పౌడర్, ఆయిల్ బాల్స్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పరిశుద్ధ నిర్వహణ పనులను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి మొదలు డివిజన్, మండల స్థాయి పంచాయతీ అధికారులు ప్రతినిత్యం పారిశుద్ధ్య నిర్వహణ పనులను పర్యవేక్షణ చేయాలని సూచించారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి లక్ష్మణ్ సింగ్, జిల్లా షెడ్యూల్ కులాల అధికారిని రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, మునిసిపల్, రెవెన్యూ, డిఎల్‌పివోలు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.