నిజామాబాద్, జూలై 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. ఈసారి వర్షాకాలంలో సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నందున అందుకు అనుగుణంగా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వీటిలో 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఒక ఎయిడెడ్ జూనియర్ కళాశాల, మూడు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, మూడు మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలు, 14 ప్రైవేటు జూనియర్ కళాశాలలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశామని తెలిపారు.
మొత్తం మొదటి సంవత్సరం విద్యార్థులు 10,142 మంది కాగా వీరిలో 9,144 మంది జనరల్ కాగా 998 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. అలాగే రెండవ సంవత్సరం ఫెయిల్ ఐన విద్యార్థులు మొత్తం 5,168 మంది కాగా విరీలో జనరల్ 4,414మంది విద్యార్థులు కాగా ఒకేషనల్ 754 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. మొత్తం 15,310 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు శనివారంతో పూర్తవుతున్నాయని తెలిపారు.
విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి సమయానికి బస్సులను ఏర్పాటు చేయించామని, అలాగే పరీక్ష కేంద్రాలలో విద్యుత్ సరఫరా, మంచినీటి వసతి, వాష్ రూమ్ ల నిర్వహణ , ఆశా వర్కర్ల తో మెడికల్ క్యాంప్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను నేరుగా ఇంటర్నెట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని డి.ఐ.ఈ.ఒ. తెలిపారు. హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని తెలిపారు.
పరీక్షా కేంద్రాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ చిరంజీవి, కనక మహాలక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. విద్యార్థులు ఎలాంటి సమస్యలు అయినా తమ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.
విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ రాస్తున్నవారికి కానీ, ఫెయిల్ అయిన విద్యార్థులు పరీక్షలు రాస్తున్న వారికి కానీ హాల్‌టికెట్లలో ఎలాంటి తప్పులు దొర్లిన తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి తెలిపారు. అలాగే ఆయా కళాశాలల ప్రిన్సిపాల్‌లకు కూడా తాము ఈ విషయమై తగిన ఆదేశాలు జారీ చేశామని, తప్పులు ప్రింట్ అయిన హాల్ టికెట్లను సవరించేందుకు అవకాశం ఉందని తెలిపారు.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చీఫ్ సూపరింటెండెంట్‌లకు, డిపార్ట్‌మెంటల్ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశామని జిల్లా ఇంటర్ విద్య అధికారి తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ, ఆర్టీసీ , రెవెన్యూ, పోలీస్ విభాగం, పోస్టల్ విభాగంతో సమన్వయం చేసుకుంటూ పరీక్షల నిర్వాణకు ముందుకు వెళ్తున్నామని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏ సమస్య అయినా పరిష్కరించేందుకు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సిద్ధంగా ఉందని అన్నారు.