తెలివితేటలు ఏ ఒక్కరి సొంతం కాదు

నిజామాబాద్‌, జూలై 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలివితేటలు ఏ ఒక్కరికో సొంతం కాదని, ప్రతిభావంతులుగా మారేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరికి అర్హత, అవకాశాలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి పేర్కొన్నారు. తెలివితేటలకు కుల, మతం, పేద, ధనిక అనే తారతమ్యాలు ఉండవని స్పష్టం చేశారు. ఆర్మూర్‌ పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం చిట్ల ప్రమీల జీవన్‌ రాజ్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు వీలుగా ప్రతి యేటా నిర్వహిస్తున్న ఆనవాయితీని పాటిస్తూ ‘విద్యా స్ఫూర్తి’ కార్యక్రమం నిర్వహించారు.

పదవ తరగతి వార్షిక పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ఆర్మూర్‌ పట్టణంలోకి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారి దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి మాట్లాడుతూ, తెలివితేటలు కొందరికే సొంతం అని ప్రస్తుత సమాజంలో నెలకొని ఉన్న దురభిప్రాయం దూరం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఈ తరహా తప్పుడు దృక్పథం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, దిగువ మధ్యతరగతి విద్యార్థుల మనసుల్లో ఆత్మన్యూనత భావం నెలకొని అనేకమంది తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మతః వచ్చే లక్షణాలు, మనం పెరిగే వాతావరణం, ఆలోచనా తీరుపైనే మేధస్సు అనేది ఆధారపడి ఉంటుందని పలు పరిశోధనల్లో వెల్లడైందని అన్నారు. అందుకే పిల్లల్లో చిన్నతనం నుంచే సానుకూల దృక్పధాన్ని పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాద్యాయులు శాయశక్తులా కృషి చేయాలని హితవు పలికారు.

పసి వయసులో ఉండే పిల్లలు మైనం ముద్ద లాంటివారని, వారిని ఏ రకంగా మల్చాలన్నది తల్లిదండ్రులు, గురువుల పైనే ఆధారపడి ఉంటుందన్నారు. ముఖ్యంగా బ్రహ్మ స్వరూపులుగా కొలువబడే గురువులు విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్ధేందుకు అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. బండరాయిని ఓ శిల్పి ఎలాగైతే దేవతామూర్తి విగ్రహంగా చెక్కి పూజలందుకునేలా చేస్తాడో, ఉపాధ్యాయులు కూడా అదే స్ఫూర్తితో పిల్లల్లో సామాజిక స్పృహ, సానుకూల దృక్పధాన్ని పెంపొందిస్తూ, చక్కటి విద్యా బోధన అందించడం ద్వారా వారి ఉన్నతికి దోహదపడి గురువు స్థానానికి సార్థకత చేకూర్చాలన్నారు.

ప్రతి ఒక్కరి జీవితంలో విద్య ఎంతో ప్రాముఖ్యమైనదని పేర్కొన్నారు. కేవలం ఉద్యోగం, డబ్బు సంపాదన అనే కాకుండా, చదువు వల్ల సమాజంలో తగిన గౌరవం లభిస్తుందని, సమాజానికి కూడా హితం జరుగుతుందని కమిషనర్‌ పార్థసారథి అన్నారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టిన నేపద్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారని అన్నారు. దీనిని అనుకూలంగా మల్చుకుని బోధనా నైపుణ్యాలను పెంపొందించుకుంటే సర్కారు బడులకు మరింత ఆదరణ పెరుగుతుందని ఉపాధ్యాయులకు సూచించారు.

ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించిన తల్లిదండ్రుల నమ్మకం వమ్ము కాకుండా చూడాల్సిన గురుతర బాధ్యతను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదని అన్నారు. స్వార్థ చింతన పెరిగిపోతున్న నేటి తరుణంలో సమాజ హితం కోసం పాటుపడే వ్యక్తిత్వాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలని హితవు పలికారు. కాగా, తన తల్లిదండ్రుల పేరిట నెలకొల్పిన చిట్ల ప్రమీల జీవన్‌ రాజ్‌ మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో 2008 నుండి విద్యా ప్రోత్సాహక కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి వెల్లడిరచారు.

ఇందులో భాగంగా వచ్చే ఆగస్టు నెలలో విద్యార్థుల కెరీర్‌ కు, పోటీ పరీక్షలలో విజయానికి దోహదపడే విధంగా హ్యాండ్‌ రైటింగ్‌ తరగతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వచ్చే సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో ఉపాధ్యాయులకు నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణా తరగతులు నిర్వహిస్తామని అన్నారు. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులు కూడా ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చు అనడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి నిదర్శనమని పేర్కొన్నారు.

నిజానికి ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్య సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారిలోనే ఎక్కువ కసి, పట్టుదల ఉంటుందని, సమస్యలను అధిగమించే నేర్పు అలవడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లలో చక్కటి బోధనా సామర్థ్యం కలిగిన నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, వారి బోధన, మార్గదర్శకత్వంలో ఉన్నతమైన కెరీర్‌ దిశగా పిల్లలు ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమం కింద పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోందని అన్నారు.

ఆంగ్ల మాధ్యమాన్ని సైతం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రభుత్వ బడులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదవ తరగతిలో టాపర్లుగా నిలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుతం ఎస్సెస్సీ చదువుతున్న వారు పట్టుదలతో చదివి అత్యుత్తమ ఫలితాలు నమోదు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్సెస్సీలో టాపర్లుగా నిలిచిన ఆర్మూర్‌ ప్రభుత్వ జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలకు చెందిన శ్రీనాథ్‌, కె.వరుణ్‌, బాలికల పాఠశాలకు చెందిన అక్షర, అశ్విత, రాంమందిర్‌ ఉన్నత పాఠశాలకు చెందిన సృజన, తులసి చందన, సైదాబాద్‌ ఉర్దూ మీడియం జెడ్పిహెచ్‌ ఎస్‌ కు చెందిన హమీదాబీ, నదియా బేగంలకు అవార్డులతో సత్కరించి ప్రోత్సాహకాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ ఆర్దీవో శ్రీనివాసులు, ఎంఈఓ రాజ్‌ గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »