కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలను విరివిగా చేపట్టాలి

నిజామాబాద్‌, జూలై 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలను విరివిగా చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే సమయంలో అర్హులైన ప్రతి ఒక్కరు కోవిడ్‌ బారిన పడకుండా వ్యాక్సిన్లు తీసుకునేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ ఆయా శాఖల అధికారులతో కోవిడ్‌ నియంత్రణ, సీజనల్‌ వ్యాధుల నిర్మూలన, హరితహారం, సంక్షేమ వసతి గృహాల మరమ్మతులు తదితర అంశాలపై సమీక్ష జరిపారు.

కరోనా కేసులు మళ్లీ స్వల్ప మోతాదులో పెరుగుతున్నందున కోవిడ్‌ పరీక్షల పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, పరిస్థితి అదుపు తప్పకుండా అంతటా అప్రమత్తంగా వ్యవహరించాలని హితవు పలికారు. పన్నెండు సంవత్సరాలు పైబడిన వయస్సు గల విద్యార్థిని, విద్యార్థులకు పూర్తి లక్ష్యం మేరకు వ్యాక్సిన్లు అందించాలని, సోమవారం నుండి అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రాధాన్యత అంశంగా భావిస్తూ ఉధృతంగా చేపట్టాలని ఆదేశించారు. స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని పూర్తి స్థాయిలో లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని, పైపైన పని చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

ఈ సందర్భంగా కోటగిరి మండల కొడిచర్ల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులకు, మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన నేపథ్యంలో అక్కడ నెలకొని ఉన్న పరిస్థితి గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అందరికి టెస్టులు చేశామని, పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. దీంతో కలెక్టర్‌ స్పందిస్తూ, ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, కరోనా సోకిన వారిని ఐసోలేషన్‌ లో ఉంచి తగిన చికిత్సలు చేయాలని, పాఠశాలను యధావిధిగా కొనసాగించాలని సూచించారు.

సీజనల్‌ వ్యాధులను నియంత్రించేందుకు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను పకడ్బందీగా జరిగేలా చూడాలని, ప్రతి మండలంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, మండల వైద్యాధికారి రోజులు రెండు గ్రామాలను సందర్శించి సర్వే తీరును నిశితంగా పరిశీలించాలని కలెక్టర్‌ ఆదేశించారు. మున్సిపల్‌ పట్టణాల్లో కమిషనర్లు, మెప్మా కో ఆర్డినేటర్లు పర్యవేక్షించాలన్నారు. ప్రతి కుటుంబం తప్పనిసరిగా దోమ తెరలు వాడేలా అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం చేయాలని అన్నారు.

హరితహారం ప్రగతిని సమీక్షిస్తూ, వచ్చే వారం రోజుల్లోపు నిర్దేశించిన లక్ష్యంలో 80 శాతం వరకు మొక్కలు నాటేలా అన్ని శాఖల అధికారులు చొరవ చూపాలన్నారు. పక్షం రోజుల అనంతరం జిల్లాలో ఎక్కడ చూసినా ప్రతి ఒక మీటరు దూరానికి ఒక మొక్క తప్పనిసరిగా కనిపించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. ప్రధానంగా రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను గుర్తిస్తూ, వరుస క్రమంలో మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని, రైతు వేదికలు, విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల వద్ద ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు.

భారీ వర్షాలకు దెబ్బతిన్న మొక్కలు, ట్రీ గార్డులను సరి చేసుకోవాలని, మొక్కల సంరక్షణ చర్యలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుదర్శన్‌, జెడ్పి సీఈఓ గోవింద్‌, డీపీవో జయసుధ, డీఆర్‌డీఓ చందర్‌, మెప్మా పీడీ రాములు, పంచాయతీరాజ్‌ ఈ.ఈలు శంకర్‌, మురళి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »