నిజామాబాద్, జూలై 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. శనివారం ఆయన తన ఛాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు, ఇప్పటికే పేర్లు కలిగి ఉన్న వారు ఏవైనా మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వీలుగా సమర్పించాల్సిన దరఖాస్తు ఫారంలలో ఎన్నికల సంఘం స్వల్ప మార్పులు చేసిందని తెలిపారు.
ఈ మార్పుల గురించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ఎంతో కీలకమైనందున, అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా తప్పిపోకుండా పేర్లు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. అదేవిధంగా ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ తో స్వచ్చందంగా అనుసంధానం చేసుకునేలా కృషి చేయాలని కోరారు. ఈ విషయమై విస్తృత ప్రచారం నిర్వహించాలని, ప్రజలను చైతన్యపర్చేలా కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ సూచించారు.
ఆధార్ అనుసంధానం వల్ల బోగస్ ఓటర్ల బెడదను సులువుగా నివారించవచ్చని, జాబితాలో ఓటరు పేరు ఒకే చోట ఉంటుందని, మరోచోట పునరావృతం అయ్యేందుకు ఆస్కారం ఉండదని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఓటర్లు ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ కోరగా, ఆయా పార్టీల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.
సమావేశంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ పవన్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు మహంతి (బీఎస్పీ), గంగకిషన్ (బిజెపి), పీ.సుధాకర్ (సీపీఐ), లక్ష్మణ్ (కాంగ్రెస్), సునీల్ జాదవ్ (ఎన్సీపీ), షకీల్ ఫాజిల్ (ఎంఐఎం), కృష్ణ ప్రసాద్ (టీఆర్‌ఎస్), హాజ్రాబేగం (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ) పాల్గొన్నారు.