నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవు

నిజామాబాద్‌, జూలై 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిడ్‌ వ్యాధి నివారణ కోసం చేపడుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. పన్నెండు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన విద్యార్థులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

శనివారం కలెక్టరేటులోని ప్రగతి భవన్లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ లో ఇప్పటివరకు సాధించిన ప్రగతి గురించి ఒక్కో శాఖ వారీగా, విద్యా సంస్థల వారీగా కలెక్టర్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆశించిన ప్రగతి లేకపోవడం పట్ల కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పదేపదే సూచిస్తున్నప్పటికీ పలువురు అధికారులు అలసత్వ వైఖరిని వీడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉన్నత పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ, ఇతర అన్ని కళాశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు ఒక్కో విద్యా సంస్థ వారీగా వివరాలు సేకరించి ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా అర్హులైన వారందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్లు వేయించాలన్నారు. ఈ విషయంలో మండల వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ఒక్కో వ్యాక్సీనేటర్‌ ప్రతి రోజు కనీసం వంద మందికి తగ్గకుండా వ్యాక్సిన్‌ వేసేలా అనునిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు. విద్యార్థులందరికీ వచ్చే బుధవారం వరకు మొదటి, రెండు డోసుల వ్యాక్సిన్‌ పూర్తి కావాలని గడువు విధించారు.

ప్రతి విద్యా సంస్థకు చెందిన పన్నెండు సంవత్సరాలు పైబడిన విద్యార్థులందరికీ వ్యాక్సిన్‌ వేసేలా సంబందిత విద్యా సంస్థ బాధ్యులు చొరవ చూపాలని కలెక్టర్‌ హితవు పలికారు. కాగా, కంటి వెలుగు కార్యక్రమం కింద ఇదివరకు నిర్ధారించిన వారిని క్యాటరాక్ట్‌ ఆపరేషన్ల నిమిత్తం పంపించాలని, ఒక్కో డివిజన్‌ నుండి ప్రతిరోజు కనీసం ఇరవై మంది చొప్పున పంపాలని సూచించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాల మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన జరిపిస్తూ, వారం వ్యవధిలో పూర్తయ్యేలా చూడాలని, పనులు నాణ్యతతో జరిగేలా పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఇమ్యూనైజషన్‌ విభాగం అధికారులు అశోక్‌, రమేష్‌, డిప్యూటీ డీఎం హెచ్‌ఓ తుకారాం రాథోడ్‌, డీఈఓ దుర్గా ప్రసాద్‌, డీఐఈఓ రఘురాజ్‌, సంక్షేమ శాఖల అధికారులు నర్సయ్య, శశికళ, నాగురావు, ఆర్‌సీఓలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »