నేటి నుండి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

నిజామాబాద్‌, జూలై 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్టు 1వ తేదీ సోమవారం నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ శానిటైజర్‌ బాటిల్‌ తోపాటు అవసరమైతే మంచినీటి బాటిల్‌ కూడా తెచ్చుకోవాలని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి సూచించారు. విద్యార్థులు ఎవరూ కూడా సెల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లను పరీక్ష హాల్లోకి తీసుకురారాదని పేర్కొన్నారు.

చీఫ్‌ సూపరింటెండెంట్‌లు డిపార్ట్మెంటల్‌ అధికారులు ఇతర పరీక్షల నిర్వహణ సిబ్బంది కూడా సెల్‌ ఫోన్లు పరీక్షలు జరుగుతున్న సమయంలో వాడరాదని అన్నారు. ఈసారి వర్షాకాలంలో సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నందున జవాబు పత్రాల బండిలను ప్లాస్టిక్‌ పాలిథిన్‌ కవర్లలో చుట్టి పార్సిల్‌ చేయాల్సి ఉంటుందని, జిల్లాలో 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని , వీటిలో 15 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ఒక ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాల, మూడు రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలు, మూడు మోడల్‌ స్కూల్‌ జూనియర్‌ కళాశాలలు, 14 ప్రైవేటు జూనియర్‌ కళాశాలలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశామని చెప్పారు.

మొదటి సంవత్సరం విద్యార్థులు మొత్తం 10,142 మంది కాగా వీరిలో 9,144మంది జనరల్‌ , 998 మంది ఒకేషనల్‌ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలియజేశారు. అలాగే రెండవ సంవత్సరం ఫెయిల్‌ ఐన విద్యార్థులు మొత్తం 5,168 మంది కాగా విరీలో జనరల్‌ 4,414మంది విద్యార్థులు కాగా ఒకేషనల్‌ 754 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని అన్నారు. మొత్తం 15,310 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నారని పేర్కొన్నారు.

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ ప్రాక్టికల్‌ పరీక్షలు వచ్చే శనివారంతో పూర్తవుతున్నాయని తెలిపారు. విద్యార్థినీ విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి సమయానికి బస్సులను ఏర్పాటు చేయించామని, అలాగే పరీక్ష కేంద్రాలలో విద్యుత్‌ సరఫరా, మంచినీటి వసతి, వాష్‌ రూమ్‌ల నిర్వహణ, ఆశా వర్కర్లతో మెడికల్‌ క్యాంప్‌ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని, విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను నేరుగా ఇంటర్నెట్‌ నుంచి కూడా డౌన్లోడ్‌ చేసుకోవచ్చు అని డి.ఐ.ఈ.ఒ. సూచించారు.

హాల్‌ టికెట్లపై ప్రిన్సిపాల్‌ సంతకం అవసరం లేదని, పరీక్షా కేంద్రాలలో చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్మెంటల్‌ అధికారులు పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసారని తెలిపారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు డాక్టర్‌ చిరంజీవి, కనక మహాలక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు.

విద్యార్థులు ఎలాంటి సమస్యలు అయినా తమ దృష్టికి తీసుకురావచ్చని, విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్‌ రాస్తున్నవారికి కానీ , ఫెయిల్‌ అయిన విద్యార్థులు పరీక్షలు రాస్తున్న వారికి కానీ హాల్‌ టికెట్లలో ఎలాంటి తప్పులు దొర్లిన తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి తెలియజేశారు. అలాగే ఆయా కళాశాలల ప్రిన్సిపాల్‌లకు కూడా తాము ఈ విషయమై తగిన ఆదేశాలు జారీ చేశామని, తప్పులు ప్రింట్‌ అయిన హాల్‌ టికెట్లను సవరించేందుకు అవకాశం ఉందన్నారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చీఫ్‌ సూపర్డెంట్‌లకు, డిపార్ట్మెంటల్‌ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశామని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి అన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో విద్యుత్‌ శాఖ, ఆర్టీసీ , రెవెన్యూ, పోలీస్‌ విభాగం, పోస్టల్‌ విభాగంతో సమన్వయం చేసుకుంటూ పరీక్షల నిర్వాణకు ముందుకు వెళ్తున్నామని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏ సమస్య అయినా పరిష్కరించేందుకు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సిద్ధంగా ఉందన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »