నిబంధనలు పాటించని వాహనాలపై చర్యలు చేపట్టండి

నిజామాబాద్‌, ఆగష్టు 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ ఆదాయాన్ని దెబ్బతీసేలా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్‌ వాహనాలపై కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలాంటి పర్మిట్లు లేకుండా ప్రయాణికులతో రాకపోకలు సాగించే వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రగతి భవన్లో ఆయా శాఖల ప్రగతి పై కలెక్టర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రీజియన్‌ పరిధిలో ఆర్టీసీ ఆదాయ వనరుల గురించి ఆర్‌ ఎం ఉమాదేవి వివరిస్తూ, ప్రైవేట్‌ వాహనాల కారణంగా పెద్దఎత్తున ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతోందని కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. దీంతో కలెక్టర్‌ స్పందిస్తూ, పర్మిట్లు లేకుండా తిరిగే వాహనాలను కట్టడి చేసేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని రవాణా, పోలీస్‌ శాఖల అధికారులను ఆదేశించారు. బోధన్‌ రోడ్‌ బస్టాండ్‌ వద్ద నిబంధనలు పాటించని ప్రైవేట్‌ వాహనాలను నియంత్రించేందుకు పోలీస్‌ బూత్‌ ఏర్పాటు చేసి పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు.

అన్ని రూట్‌లలో ఆర్టీసీ బస్సులు నడిపించాలని ఆర్‌.ఎంను ఆదేశించారు. హరితహారం ప్రగతిని సమీక్షిస్తూ, ఆయా శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధించేందుకు చొరవ చూపాలని కలెక్టర్‌ అధికారులకు హితవు పలికారు. దీనిని ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని, వారాంతం లోపు లక్ష్యం పూర్తి చేయాలని గడువు విధించారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, హరితహారం అమలు తీరును పర్యవేక్షించాలన్నారు.

పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, రైతు వేదికలు, విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల వద్ద హరితహారం అమలు తీరును పరిశీలించాలని, అదేసమయంలో రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాల్లో నాటిన మొక్కలను గమనించి వాస్తవ పరిస్థితులతో కూడిన నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ అమలు తీరుపై సమీక్ష జరిపిన కలెక్టర్‌, ప్రగతి అంతంత మాత్రంగానే ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ లోపాలను సరిదిద్దుకుని రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని పూర్తి స్థాయిలో సాధించేలా ప్రణాళికాబద్ధంగా పని చేయాలని సూచించారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించే కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి నోటీసులు ఇవ్వాలన్నారు. ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో అర్హులైన ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేలా విద్యా శాఖ అధికారులు చొరవ చూపాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, డీఎఫ్‌ఓ సునీల్‌, డీసీపీ అరవింద్‌ బాబు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »