ఎడపల్లి, ఆగష్టు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయుర్వేద శాస్త్రానికి సుశ్రుతుడు గుండెకాయ అయితే చరకుడు వెన్నెముక వంటివాడని ఆయుర్వేద వైద్యుడు డా. వెంకటేష్ పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆయుర్వేద భవనంలో భారత ఆయుర్వేద పితామహుడు చరక మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు.
స్థానిక ఎంపీపీ శ్రీనివాస్, వైద్య సిబ్బంది చరక మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యుడు డా.వెంకటేష్ మాట్లాడుతూ భారతీయ ఆయుర్వేదానికి అనితర సాధ్యమైన పరిపూర్ణత సాధించి పెట్టిన చరకుడు క్రీస్తు పూర్వం 8 వ శతాబ్దానికి చెందినవారన్నారు. మన పురాణాలలో ‘‘చరకులు’’ అంటే సంచరిస్తూ వైద్యం చేసేవారుగా చెప్పబడిరదని, చరకుడు తన శిష్యవైద్యులతో గ్రామాలు తిరుగుతూ అక్కడి ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించేవాడని అన్నారు.
చరకుడు కాశ్మీరానికి చెందిన వాడన్నాడు. చరకుడు గొప్ప ఆయుర్వేద శిఖామణి అని పేర్కొన్నారు. సుశ్రుతుడి లాగానే చరకుడు కూడా చరకసంహిత అనే గొప్ప ఆయుర్వేద సమగ్ర విజ్ఞాన గ్రంథం రచించాడని, చరకుని ఆయుర్వేద పరిజ్ఞానం మహోత్కృష్టమైనది అభివర్ణించారు. శరీరానికి కలిగే వ్యాధులు ముఖ్యంగా వాత, పిత్త, శ్లేష్మ దోషాల వల్లే కలుగుతాయని చరకుడు సిద్ధాంతీకరించాడని చెప్పారు.
చరకున్ని భారతీయ ఆయుర్వేద పితామహుడు అని అన్నారు. ఆయుర్వేద వైద్యంలో ముఖ్య ఔషధాలలో ఒకటైన ఉసిరి కాయ, తానికాయ, కరక్కాయలతో తయారైన త్రిఫల చూర్ణం చరకుడు ప్రసాదించినదని, అలాగే వ్యాధికి జరిపే చికిత్స కంటే ముందు వ్యాధి కారణాలను కనుగొనడం ముఖ్యమని ప్రతిపాదించాడని అన్నారు. ఆధునిక వైద్యంలో నేటికీ చరక సంహితలోని వైద్య సూత్రాలను, సూక్ష్మాలను గ్రహించి వైద్యసేవలు అందించటం విశేషమని అన్నారు.
కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ షేక్ జావేద్ బాబా, హెల్త్ సూపర్వైజర్‌లు రాజేశ్వర్, దేవేందర్, విజయకుమారి, భారతి, ఫార్మాసిస్ట్ విజయలక్ష్మి, హెల్త్ డీఈఓ అనురాధ, శైలజ తదితరులు ఉన్నారు.