నిజామాబాద్, ఆగష్టు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గడిచిన మూడు నెలల నుండి నిర్విరామంగా కొనసాగిస్తున్న కృషి ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరిగిందని, 44 శాతానికే పరిమితమైన కాన్పులు 55 శాతానికి పెరిగాయని కలెక్టర్ నారాయణరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. సిజీరియన్లు కూడా 75శాతం నుండి 70 శాతానికి తగ్గించగలిగామని అన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏ ఎన్ ఎం లు, ఆశా వర్కర్లు, వైద్యాధికారుల కృషి, అంకిత భావంతోనే ఇది సాధ్యమయ్యిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇకపై కూడా ఇదే తరహా స్పూర్తితో పనిచేస్తూ, ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య మరింతగా పెరిగేలా, సాధారణ కాన్పులు ఎక్కువగా జరిగేలా కృషి చేయాలని సూచించారు. ప్రతి గర్భిణీ వివరాలు తప్పనిసరిగా నమోదు చేస్తూ, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించేలా పక్కాగా పర్యవేక్షణ చేయాలన్నారు. అవసరం లేకపోయినా సిజీరియన్లు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని, వారి పనితీరును ప్రజల ముందు బహిర్గతం చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు.
ఒక్కో వ్యాక్సినేటర్ ప్రతిరోజు వంద మందికి వ్యాక్సిన్లు వేయాలి
కొవిడ్ వ్యాధి నియంత్రణ కోసం అర్హులైన వారందరికీ బూస్టర్ డోస్ ఇచ్చేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ఒక్కో వ్యాక్సినేటర్ కనీసం వంద మందికి తగ్గకుండా వ్యాక్సిన్లు వేసేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, రోజువారీ లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఓ వైపు ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవసరమైన కొవిడ్ టీకాలు ఇస్తూనే, సంబంధిత గ్రామాల్లోనూ ప్రజలకు ప్రికాషనరీ డోస్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకుని లక్ష్య సాధన దిశగా ముందుకెళ్లాలని సూచించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ లో జిల్లా వెనుకబడి ఉన్నందున ప్రతి ఒక్కరూ లక్ష్య సాధన కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని హితవు పలికారు. కొవిడ్ వ్యాక్సినేషన్ కారణంగానే కరోనా తీవ్రతను ఎదుర్కోవడంలో సఫలీకృతం కాగలిగామని కలెక్టర్ గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వ్యాక్సినేషన్ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
ఇకపై తాను ప్రతిరోజు పీ హెచ్ సీ వారీగా వ్యాక్సినేషన్ ప్రగతిని సమీక్షిస్తానని, ఈ విషయంలో ఎవరైనా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, ఉప వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, పీ.ఓ డాక్టర్ అంజన, డీపీఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.