నిజామాబాద్, ఆగష్టు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన అధికారులు, సిబ్బంది దేశ వ్యాప్తంగా చేపట్టిన బైక్ ర్యాలీ మంగళవారం నిజామాబాద్ చేరుకుంది. రైల్వే శాఖలోని వివిధ జోన్లకు చెందిన సుమారు 40 మంది 2021 మార్చి నెలలో సబర్మతి వద్ద ర్యాలీని ప్రారంభించి వివిధ ప్రాంతాల మీదుగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.
ఈ నెల 13 న దేశ రాజధాని ఢల్లీిలో ర్యాలీ ముగియనుంది. స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో బైక్ ర్యాలీకి కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్థానిక ఆర్పీఎఫ్ అధికారులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి రోజు 120 కిలోమీటర్ల చొప్పున సుమారు 1400 కిలోమీటర్ల పొడుగునా బైక్ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ ప్రశంసించారు. ర్యాలీ సందర్భంగా మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత గురించి, రైళ్లు, రైల్వే స్టేషన్లలో పరిశుభ్రత తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతో మంచి పరిణామమని పేర్కొన్నారు.
అనేక ప్రాంతాలు, భాషలు, సంస్కృతుల మేళవింపు కలిగి ఉన్నప్పటికీ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అనే విషయానికి బైక్ ర్యాలీ నిదర్శనమన్నారు. స్వాతంత్రానంతరం భారతదేశం అన్ని రంగాల్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతూ, ముందుకు దూసుకెళ్తోందన్నారు.
ప్రపంచాన్ని వణికించిన కరోనా సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడంలోనూ భారత్ విజయవంతమైందని గుర్తు చేశారు. 75 సంవత్సరాల స్వాతంత్య్ర ఫలాల స్పూర్తితో భారతదేశం మరింత ఉన్నతిని సాధిస్తుందని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ సిబ్బంది నుండి కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కరీముల్లాప్‌ా, సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, అసదుల్లాప్‌ా తదితరులు పాల్గొన్నారు.